సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆడ పిల్లలే డామినేట్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు జననాలను పరిశీలిస్తే మగ పిల్లలకన్నా ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 1001 మంది ఆడపిల్లలున్నారు. హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఐఎస్) పని తీరు సూచికల పురోగతి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా తరువాత పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య మెరుగ్గా ఉంది. పల్నాడు జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 993 మంది ఆడపిల్లలున్నారు. పశ్చిమగోదావరిలో వెయ్యి మంది మగ పిల్లలకు 991 మంది ఆడ పిల్లలున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు రాష్ట్రం లో 2,55,582 జననాలు సంభవిస్తే అందులో 1,31,954 మగ పిల్లలు కాగా 1,23,628 ఆడ పిల్లలుగా నివేదిక తెలిపింది. రాష్ట్రం మొత్తం సగటు చూస్తే ఆగస్టు వరకు వెయ్యి మంది మగ పిల్లలకు 937 మంది ఆడ పిల్లలున్నారని పేర్కొంది.
ప్రత్యేకతల జిల్లా.. అల్లూరి
అల్లూరి సీతారామరాజు జిల్లాకు మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో నూటికి నూరు శాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా నూరు శాతం కాన్పులు కోతల్లేకుండా సాధారణ కాన్పులే. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు 6,181 కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణంగా జరిగి నట్లు నివేదిక పేర్కొంది. వీటిలో ఒక్కటి కూడా కోత (సిజేరియన్) కాన్పు లేదని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment