Health Information
-
వైద్యం.. మరింత సులభతరం
రోగి వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు ఇదివరకు తీసుకున్న చికిత్స.. వైద్య పరీక్షల నివేదికలు తప్పనిసరి. దీని ఆధారంగా చికిత్స ఏది అవసరమో అది కొనసాగించవచ్చు. ఇలాంటివి రోగి మరచిపోయినప్పుడు వైద్యులు మొదటి నుంచి పరీక్షలు, స్కానింగ్ చేయించి వివరాలు తెలుసుకుని తర్వాత చికిత్స ప్రారంభించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో భాగంగా అలాంటి కాగితాలు ఏవీ లేకుండానే ‘రోగి చరిత్ర’ మొత్తం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (ఈ–హెల్త్ రికార్డ్)లో నిక్షిప్తం చేసే విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోగులు రాష్ట్రంలో ఎక్కడ వైద్యానికి వెళ్లినా తమ పూర్వపు ఆరోగ్య స్థితులను ఇట్టే తెలియజెప్పే ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈ–హెచ్ఆర్) రిజిస్ట్రేషన్ ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. రోగులు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పుడు వారికి వైద్యపరీక్షలు నిర్వహించడం, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి జబ్బులు ఇలాంటివేవైనా ఉంటే పూర్తిస్థాయిలో వివరాలన్నీ ఎల్రక్టానిక్ రికార్డుల్లోకి ఎక్కిస్తారు. రోగి ఆధార్, మొబైల్ నంబర్లను క్రోడీకరించి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఈ నంబర్ ఆధారంగా పూర్వపు ఆరోగ్య వివరాలన్నీ ఏ డాక్టరు వద్దకు వెళ్లినా తెలుసుకోవచ్చు. అనంతలో 43 వేలు, శ్రీసత్యసాయిలో 35 వేలు.. రాష్ట్రంలో 542 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అందులో శ్రీసత్యసాయి జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 26 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల వాసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుండగా, పట్టణ పేదలు అర్బన్ హెల్త్ కేంద్రాలకు వస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో శ్రీసత్యసాయి జిల్లాలో 35,052 మందికి, అనంతపురం జిల్లాలో 43,578 మందికి ఈహెచ్‌ఆర్ నమోదు పూర్తి చేశారు. ఇప్పటికీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఎలక్ట్రానిక్ హెల్త్‌రికార్డులతో.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల వల్ల వైద్యం మరింత సులభమవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన డేటా మొత్తం ఇందులో ఉండటంతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ ఆస్పత్రికెళ్లినా పూర్తి వివరాలు ఉంటాయి. కొత్తగా ఎప్పుడు వైద్యం చేయించుకున్నా అదనపు వివరాలు నమోదు చేస్తారు. దీనివల్ల జీవనశైలి జబ్బులు ఎంతమందికి ఉన్నాయి, దీర్ఘకాలిక జబ్బులు ఎంతమందికి ఉన్నాయి ఇలా జిల్లాలో ఉన్న మొత్తం వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీన్నిబట్టి జబ్బుల శైలిని కూడా అంచనా వేయొచ్చు. ఈహెచ్‌ఆర్‌లో ఆరోగ్యశ్రీ నెంబర్ కూడా నమోదు చేయడం వల్ల ఎక్కడికెళ్లినా ఉచితంగానే వైద్యం పొందే అవకాశం ఉంటుంది. రోగులతో పాటు వైద్యుల వివరాలు ఏబీడీఎంలో నమోదు చేస్తారు. ఏ డాక్టరు ఏ వైద్యం చేశారన్నది కూడా ఇకపై హెల్త్ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇదీ చదవండి: సర్కారీ వైద్యం సూపర్ -
అల్లూరి జిల్లా ఆడపిల్లల ఖిల్లా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆడ పిల్లలే డామినేట్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు జననాలను పరిశీలిస్తే మగ పిల్లలకన్నా ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 1001 మంది ఆడపిల్లలున్నారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) పని తీరు సూచికల పురోగతి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా తరువాత పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య మెరుగ్గా ఉంది. పల్నాడు జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 993 మంది ఆడపిల్లలున్నారు. పశ్చిమగోదావరిలో వెయ్యి మంది మగ పిల్లలకు 991 మంది ఆడ పిల్లలున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు రాష్ట్రం లో 2,55,582 జననాలు సంభవిస్తే అందులో 1,31,954 మగ పిల్లలు కాగా 1,23,628 ఆడ పిల్లలుగా నివేదిక తెలిపింది. రాష్ట్రం మొత్తం సగటు చూస్తే ఆగస్టు వరకు వెయ్యి మంది మగ పిల్లలకు 937 మంది ఆడ పిల్లలున్నారని పేర్కొంది. ప్రత్యేకతల జిల్లా.. అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లాకు మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో నూటికి నూరు శాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా నూరు శాతం కాన్పులు కోతల్లేకుండా సాధారణ కాన్పులే. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు 6,181 కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణంగా జరిగి నట్లు నివేదిక పేర్కొంది. వీటిలో ఒక్కటి కూడా కోత (సిజేరియన్) కాన్పు లేదని వెల్లడించింది. -
ఛత్తీస్‌గఢ్‌కు పల్సస్ విస్తరణ
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కంపెనీ పల్సస్ తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు విస్తరించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్‌తో పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు భేటి అయిన సందర్భంగా ఈ విషయమై ఇరువురి మధ్యా ఒక అంగీకారం కుదిరినట్లు పల్సస్ తెలియజేసింది. వచ్చే ఏడాది కాలంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్... పల్సస్, ఒమిక్స్ సారథ్యంలో దంతేవాడ, రాజ్‌నందగావ్, రాయ్‌పూర్‌లో రానున్న సెజ్‌లలోని 3 కేంద్రాల్లో 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని శ్రీనుబాబు ఈ సందర్భంగా చెప్పారు. అలాగే వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని హిందీలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పల్సస్‌కు దేశంలోని 7 సెజ్ యూనిట్లలో కేంద్రాలున్నాయి. వీటిలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులున్నారు. ఇంకా యూకే, సింగపూర్, బెల్జియంలలోనూ సేవలందిస్తోంది. -
ట్విట్టర్లో ఆరోగ్య సమాచారం
ప్రాక్టో వ్యవస్థాపకులు శశాంక్ వెల్లడి కొరుక్కుపేట: వరల్డ్ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ప్రాక్టో మరింతగా ఆరోగ్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఆసంస్థ వ్యవస్థాపకులు శశాంక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధ తీసుకునేలా ప్రాక్టో సరికొత్తవిధానంలోనే ఆరోగ్య సేవలను కల్పిస్తుందని తెలిపారు. ఇప్పటికే వెబ్, ఎం-వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ద్వారా ఆరోగ్య సూచనలు అందిస్తున్నామని అన్నారు.ప్రస్తుతం ట్విట్టర్ ద్వారా హెల్త్ కేర్ సూచనలు అందిస్తున్నామని తెలిపారు.ట్విట్టర్లో అడిగే ఆరోగ్య సమస్యల ప్రశ్నలకు తమ వైద్యులు సరైన ఆరోగ్య సమాచారాన్ని కల్పిస్తుందని వివరించారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కోన్నారు.