ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉమ్మడి జిల్లాలో బాల, బాలికల నిష్పత్తి మధ్య భారీగా అంతరం కనిపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నమోదవుతున్న జనన, మరణాలు బాల, బాలికల నిష్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. పుడుతున్న వారిలో బాలురే అధికంగా ఉంటున్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. ఆయా మున్సిపాలిటీలు, ప్రణాళిక శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా గణాంకాలను క్రోడికరించి ప్రతీ రెండు సంవత్సరాలకోసారి ఒక ఏడాదికి సంబంధించిన జనన, మరణాల లెక్కలను సివిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ విడుదల చేస్తుంది. అందులో భాగంగా 2018 ఏడాదికి సంబంధించి గణాంకాలను తాజాగా ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం బాలికల కంటే బాలుర సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వివరాల ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2018లో 75,344 మంది జన్మించగా, 10,596 మంది మరణించారు. అయితే, జన్మిస్తున్న వారిలో బాలురే అధికంగా ఉన్నారు. ఇటు మరణిస్తున్న వారిలోనూ మహిళల కన్నా పురుషులు అధికంగా ఉండటం గమనార్హం. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా మొత్తం 25,43,647 కాగా, పురుషులు 12,46,875 మంది, మహిళలు 12,96,781 మంది ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనే జననాలు ఎక్కువ..
ఉమ్మడి జిల్లాలో 2018 సంవత్సరంలో మొత్తం 75,344 మంది జన్మించారు. ఇందులో 37,972 మంది బాలురు జన్మిస్తే, 36,154 మంది బాలికలు ఉన్నారు. అంటే బాలికల కంటే 1,818 మంది బాలురు ఎక్కువ జన్మించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే జననాల సంఖ్యలో ఎక్కువ ఉంది. జీవన ప్రమాణాలు పెరగడం, కుటుంబ నియంత్రణ అమలు కాకపోవడంతో జననాల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 2018 సంవత్సరంలో 10,596 మంది మృతి చెందారు. ఇందులో 4,939 మంది మహిళలుంటే, 5,657 మంది పురుషులున్నారు. మరణాల రేటులోనూ పురుషులే అధికంగా ఉన్నారు. శిశు మరణాలు కూడా ఎక్కువగానే సంభవించినట్లు సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. 2018లో 480 శిశు మరణాలు నమోదైనట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment