విజయ సంకేతం చూపుతున్న మోహనమ్మ -ఇంట్లో ధ్యానం చేస్తున్న మోహనమ్మ
కరోనా పేరు చెబితే కుర్రాళ్లు సైతం వణికిపోయే పరిస్థితి. కానీ 105 ఏళ్ల వయస్సులోనూ ఓ బామ్మ..మహమ్మారిని విజయవంతంగా తిప్పికొట్టారు. వైద్యులు, నర్సుల సహకారంతో త్వరగానే కోలుకుని పెద్దాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మనో నిబ్బరంతో ఉంటే కరోనా ఏమీ చేయదని చాటి చెప్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానావీధికి చెందిన బి.మోహనమ్మ వయస్సు 105 ఏళ్లు. ఆమె భర్త మాధవస్వామి 1991లోనే మరణించారు. అప్పట్లో ఆయన బంగారు నగలు తయారు చేసే పనిలో ఉండేవారు. వీరికి ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. కుమారుల్లో ఒకరు ఇటీవలే మరణించారు. మరొకరు ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి రిటైరయ్యారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిగా పనిచేసి వీఆర్‌ఎస్ తీసుకున్న మూడో కుమారుడు జయదాస్ నాయుడు వద్ద మోహనమ్మ ఉంటున్నారు. ఐదుగురు ఆడపిల్లల్లో పెద్ద కుమార్తెకు 82 ఏళ్లు, రెండో కుమార్తెకు 80 ఏళ్లు, మూడో కుమార్తెకు 70 ఏళ్ల వయస్సు. మిగిలిన ఇద్దరూ మరణించారు. ఇంత వయస్సులోనూ మోహనమ్మ తన పనులు తానే చేసుకుంటున్నారు. ప్రతిరోజూ యోగా, ధ్యానం, వాకింగ్ చేస్తారు. మితాహారం తీసుకుంటారు. ఇప్పటికీ కుమార్తెల ఊళ్లకు ఒక్కరే వెళ్లి వస్తుంటారు. ఆమె జీవితంలో ఎనిమిది మంది సంతానంతో పాటు 26 మంది మనవళ్లు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలను కూడా చూశారు.
కరోనా ఏమీ చేయలేకపోయింది!
కర్నూలు నగరంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి 60 ఏళ్లు దాటిన వారందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా మోహనమ్మకు కూడా పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్‌గా గత నెల 19న నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. ఆసుపత్రిలోని ఎంఎం–4 వార్డులో ఉంచి చికిత్స చేశారు. ఆమెను వైద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. కరోనా నిర్ధారణ అయిన సమయంలోనూ ఆమెకు స్వల్ప జ్వరం మినహా ఇతరత్రా లక్షణాలు లేవు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కొద్దిగా ఆయాసం రావడంతో ఆక్సిజన్ ఏర్పాటు చేశారు. అంతకు మించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఎదుర్కోకుండానే కోలుకున్నారు. ఆసుపత్రిలో ఆమెకు తోడుగా కుమారుడు జయదాస్ నాయుడు ఉన్నారు. మోహనమ్మను గత నెల 31న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఆరోగ్యకర అలవాట్ల వల్లే జయించా
గతంలో నేనెప్పుడూ ఇలాంటి రోగాన్ని చూడలేదు. అప్పుడెప్పుడో ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చిందని బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. నాకు బీపీ, షుగర్ ఉన్నా నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్యకర అలవాట్ల వల్లే నేను కరోనాను జయించగలిగా. ఇప్పటికీ యోగా, ధ్యానం చేస్తుంటా. అవే నా ఆరోగ్య రహస్యాలు.
– మోహనమ్మ
Comments
Please login to add a commentAdd a comment