కర్నూలు(హాస్పిటల్)/నంద్యాల: కరోనా బారిన పడితే 65 ఏళ్లకు పైగా వయస్సున్న వారికి ఇబ్బందనే అంశాన్ని పటాపంచలు చేస్తూ కర్నూలుకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కరోనా విజేతగా నిలిచింది. గురువారం ఆమెతో పాటు మరో ఆరుగురు కరోనాను జయించారు. కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నుంచి ముగ్గురు, నంద్యాల శాంతిరామ్ జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి నుంచి నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి 80 ఏళ్ల వృద్ధురాలు డిశ్చార్జ్ కావడం విశేషం. డిశ్చార్జ్ అయిన వారిలో కర్నూలుకు చెందిన ముగ్గురు, నంద్యాలకు చెందిన ఇద్దరు, బండిఆత్మకూరు ఒకరు, వెలుగోడు ఒకరు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 637కు చేరింది. వీరికి ఒక్కొక్కరికి రూ.2వేల ఆర్థిక సహాయం అందించినట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. (కరోనా నుంచి కోలుకున్న 92 ఏళ్ల బామ్మ)
తాజాగా ఐదుగురికి పాజిటివ్
జిల్లాలో తాజాగా మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా కర్నూలు నగరానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక ఆదోనికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు.
మరో రెండు క్లస్టర్లలోకంటైన్మెంట్ తొలగింపు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో మరో రెండు క్లస్టర్లలో కంటైన్మెంట్‌ను తొలగిస్తూ గురువారం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహానంది మండలం అబ్బీపురం, తిమ్మాపురం, పగిడ్యాల మండలం నెహ్రూనగర్ క్లస్టర్లను నాన్ కంటైన్మెంట్‌గా మార్చారు. దీంతో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఇటీవల నంద్యాల మునిసిపాలిటీలోని మల్దార్‌పేట, గుడిపాటి గడ్డ, మూలన్‌పేట, చిప్పగిరి, నగరడోణ(చిప్పగిరి), బి.తాండ్రపాడు(కర్నూలు రూరల్) తదితర నాలుగు క్లస్టర్లలో కంటైన్మెంట్‌ను తొలగించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 31 క్లస్టర్లలో కంటైన్మెంట్ తొలగిపోయింది. జిల్లాలో మొత్తం 61 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా అందులో 31 నాన్ కంటైన్మెంట్‌గా మారడంతో 30 కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment