కొడవళ్ల కార్ఖానా.. పేటేరు | 150 Families In The Making Of Sickle | Sakshi
Sakshi News home page

కొడవళ్ల కార్ఖానా.. పేటేరు

Published Sun, Nov 22 2020 4:39 AM | Last Updated on Sun, Nov 22 2020 9:12 AM

150 Families In The Making Of Sickle - Sakshi

కొలిమిలో ఇనుమును కాల్చి కొడవలిగా మలుస్తున్న కార్మికుడు

సాక్షి, అమరావతి బ్యూరో/రేపల్లె: వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైందంటే చాలు.. గుంటూరు జిల్లా తీర ప్రాంతమైన రేపల్లె మండలం పేటేరు వైపు అన్నదాతల చూపంతా. వరి కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీలో ఆ ఊరికి మంచి పేరు ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడి కొడవళ్ల తయారీ ప్రాంతం.. శ్రామికనగర్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో నిపుణులైన కార్మికులు రూపొందించే కొడవళ్లకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా మంచి డిమాండ్‌ ఉంటోంది. ఇక్కడ ఉన్న 40కు పైగా కార్ఖానాల్లో కొడవళ్ల తయారీపై ఆధారపడి దాదాపు 150 కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్నాయి. ఏడాది పొడవునా పనిచేస్తూ.. ఖరీఫ్, రబీ సీజన్లలో కోతలకు అవసరమైన కొడవళ్లను అందిస్తున్నాయి. 

చెన్నై, విశాఖ నుంచి దిగుమతి
కొడవలి తయారీకి ప్రధాన ముడిసరుకు.. ఐరన్‌ బేళ్ల కట్లకు ఉపయోగించి పనికిరాని ఇనుముగా పడవేసే బేల్‌ బద్దలు. చెన్నై, విశాఖపట్నం, కాకినాడ పోర్టులు, విజయవాడ వంటి నగరాల నుంచి వీటిని కిలోల వంతున కొనుగోలు చేస్తారు. ముడి ఇనుము పేటేరుకు చేరే సరికి కిలో రూ.30 ధర పడుతోంది. కొలిమికి అవసరమైన బొగ్గులు, కొడవలి పిడికి అవసరమైన కలప ధరలు, రవాణా చార్జీలు అదనం. 

 కొడవలికి నొక్కు పెడుతున్న కార్మికుడు   

వరికోత యంత్రాలతో తగ్గుతున్న గిరాకీ
వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాల వాడకం కొడవళ్ల విక్రయాలపై ప్రభావం చూపుతోంది. వరికోత యంత్రాల రాకతో కూలీల అవసరం క్రమంగా తగ్గుతోంది. అందుకు తగినట్టుగానే కొడవళ్లకు డిమాండ్‌ పడిపోతోంది. 

నెలకు లక్షకుపైగా కొడవళ్లు
ఆరు దశాబ్దాలుగా పేటేరు శ్రామికనగర్‌ కొడవళ్లను తయారుచేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని జంపనికి చెందిన జేమ్స్‌ అలియాస్‌ జంపని జేమ్స్‌ ఇందుకు ఆద్యుడు. కొడవళ్ల తయారీని వృత్తిగా చేసుకొని ఆయన పేటేరులో స్థిరపడ్డారు. ఆయన నుంచి చందోలు సుబ్బారావు, తదితరులు నేర్చుకున్నారు. కొడవలి తయారీలో ముందుగా ఇనుప బద్దను కొలిమిలో కాల్చి కొడవలి ఆకారంలో మలుస్తారు. కోతకు తగినట్టుగా సానపట్టి నొక్కులు కొడతారు. చేతితో పట్టుకునేందుకు వీలుగా చెక్కపిడిని అమర్చుతారు. ఇలా మూడు దశల్లో కొడవలి సిద్ధమవుతుంది. ఒక్కో కొలిమిలో రోజుకు 200 వరకు కొడవళ్లు తయారవుతాయి. నెలకు కనీసం లక్షకు పైగా కొడవళ్లను ఇక్కడ సిద్ధం చేస్తుంటారు. మూడు కేటగిరీల్లో చేసే కొడవళ్లను నాణ్యత ప్రకారం.. ఒక్కోటి రూ.30, 60, 90కు విక్రయిస్తుంటారు. 

ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలి
పెరుగుతున్న ముడి సరుకుల ధరలకు అనుగుణంగా కొడవళ్ల ధరలు పెరగడం లేదు. దీంతో ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదు. ప్రభుత్వం కొడవళ్ల తయారీని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలి. ముడిసరుకును రాయితీతో సరఫరా చేయాలి. 
 – చందోలు సుబ్బారావు,శ్రామికనగర్‌

ముడిసరుకు సరఫరా చేయాలి
రోజంతా శ్రమించినా కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ముడిసరుకు కొనుగోలు చేసేందుకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ సంస్థలతో ముడిసరుకును సరఫరా చేస్తే బాగుంటుంది.
– పసులూరి బుజ్జి, శ్రామికనగర్‌

బ్యాంకు అధికారుల వైఖరితో జాప్యం
కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసే రుణాల చెల్లింపులో బ్యాంకులు జాప్యం చేస్తున్నాయి. రుణాలను సత్వరం ఇస్తే బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. 
– చందోలు రవికుమార్, శ్రామికనగర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement