ప్రకృతి వ్యవసాయం వైపు పయనం | 2022 23 Kharif Target To Cultivate 65651 Acres Of Nature Farming | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయం వైపు పయనం

Published Mon, Apr 18 2022 11:28 PM | Last Updated on Mon, Apr 18 2022 11:28 PM

2022 23 Kharif Target To Cultivate 65651 Acres Of Nature Farming - Sakshi

బొద్దాంలో ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న రాగుల పంటను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది

వేపాడ: పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వైపు జిల్లా రైతులు దృష్టి సారించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆ ధారపడాల్సి వస్తోంది.అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టు బాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది.

అలాగే మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీట కాలు చనిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరు గుతోంది. ఈ అంశాలన్నింటిపై రైతులను వ్యవసాయాధికారులు చైతన్యపరుస్తూ పకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2016లో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. 2016– 17లో 10 క్లస్టర్లలో 50 గ్రామాల్లో ప్రకృతి సేద్యం ప్రారంభించారు.

2021–22 సంవత్సరంలో 61 క్లస్టర్లలో 34 మండలాల్లో 309 గ్రామాల్లో 41,761 మంది రైతులతో 18,382 హెక్టార్లల్లో ప్రకృతి వ్యవసాయం చేయించారు. 2022–23 సవత్సరంలో 64, 945 మంది రైతులతో 65,651 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ఖరీఫ్‌లో 49వేల మంది రైతులతో 57,700 ఎ కరాల్లో నవధాన్యాల సాగుకు సిద్ధమయ్యారు.

విస్తృతంగా అవగాహన  
సుస్థిర వ్యవసాయకేంద్రం, ప్రకృతి వ్యవసాయకేంద్రం, ఏపీ సీఎన్‌ఎఫ్‌ సిబ్బంది ప్రకృతి వ్యవసాయంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు సోకే చీడపీడల నివారణకు రసాయన పురుగుమందులకు బదులు పొలొల్లానే ఖర్చు లే కుండా ఘన, ద్రవ జీవామృతాలు, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, జిల్లేడు ద్రావణం, మీనామృతం, తదితరాలను తయారీ చేయిస్తున్నారు. పంటలకు హాని చేసే పురుగులు, కీటకాల నివారణకు పసుపు, తెలుపు పళ్లాలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయిస్తున్నా రు. ప్రభుత్వ తోడ్పాటుతో పాటు పెట్టుబడి కూడా ఆదా అవుతుండడంతో రైతులు క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు.

రాయితీపై విత్తనాలు 
భూమిలో సేంద్రియ కర్బనశాతం పెంచేందుకు ఖరీఫ్‌ ప్రధాన పంట సాగుకు ముందు నవధాన్యాలను పచ్చిరొట్ట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మినుములు, పెసర, బొబ్లర్లు, చిక్కుడు, ను  వ్వులు, ఆముదం, వేరుశనగ, ధనియాలు, మెంతులు, ఆవాలు, రాగులు, మొక్కజొన్న, కొర్రలు, సామాలు, ఆనస, దోస, టమాటా, ముల్లంగి, బంతి తదితర విత్తనాలను, పచ్చిరొట్ట జాతులైన కట్టె జనుము, పిల్లిపెసర, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది.

65వేల ఎకరాల్లో సాగు లక్ష్యం 
జిల్లాలో ఏటా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 65,651 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రణాళికలను రూపొందించి క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేస్తున్నాం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయాధికారి, విజయనగరం.

అవగాహన కల్పిస్తున్నాం
గ్రామాల్లో సేంద్రియ ఎరువులు, ఘన, ద్రవ జీవామృతాలు, కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంట వేసేముందు రైతులే విత్తనశుద్ధి చేసుకునేలా చైతన్యం కలిగించాం.ఈఏదాది ఉన్నతాధికారులు నిర్ధేశించిన మేరకు లక్ష్యాలను చేరుకునేలా క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాం.
– కె.వెంకటరావు, సీఎస్‌ఏ, బొద్దాం క్లస్టర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement