వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకుంటోంది యువత. ఆన్‌లైన్ గేమింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, యానిమేషన్‌ను వృత్తిగా మార్చుకుని డబ్బులు సంపాదించుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ‘హెచ్‌పీ ఇండియా’ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
సాక్షి, అమరావతి: కేవలం మానసిక ఉల్లాసానికి.. ఆలోచన శక్తి పెంచుకోవడానికి మాత్రమే ఆన్‌లైన్ గేమింగ్‌ను పరిమితం చేయకుండా.. దీనిని ఓ వృత్తిగా మలుచుకుంటోంది నేటి యువత. కొందరు గేమింగ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌గా మారుతుండగా.. మరి కొందరు గేమింగ్ యానిమేటర్స్‌గా మారుతున్నారు. ఈ రంగంలో పురుషుల కంటే.. మహిళల శాతమే అధికంగా ఉంటోంది. ఈ రంగంలో 56 శాతం మంది మహిళలు ఉండగా.. 44 శాతం మంది మాత్రమే పురుషులు.
ఆన్‌లైన్ గేమింగ్‌ను పూర్తిస్థాయిలో కొందరు, పాక్షికంగా మరికొందరు.. గిగ్ వర్కర్‌గా ఇంకొందరు సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నట్టు హెచ్‌పీ ఇండియా ‘ఇండియా గేమింగ్ స్టడీ 2022’ పేరిట విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే.. మిగిలిన ఐటీ జాబ్స్‌తో పోలిస్తే గేమింగ్ రంగంలోని ఉద్యోగులకు 25 శాతానికి పైగా అధికంగా జీతాలు లభిస్తున్నాయి. ఎందుకంటే.. గేమింగ్ రంగంలో ఆలోచనశక్తి అధికంగా ఉన్నవారు మాత్రమే నిలబడగలుగుతారని, అందుకే వారికి జీతాలు అధికంగా ఇస్తున్నారని ఐటీ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.
వచ్చే ఐదేళ్లలో రూ.68,800 కోట్లకు చేరనున్న మార్కెట్
భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 50.70 కోట్ల మంది ఆన్‌లైన్ గేమింగ్ ఆడుతున్నట్టు ఋఇంటరాక్టివ్ మీడియా వెంచర్ క్యాపిటల్ ఫండ్ లుమికియా’ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ విలువ రూ.20,800 కోట్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగి రూ.68,800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో ఉపాధి అవకాశాలపై యువత ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది.
సాఫ్ట్‌వేర్ రంగంలోనే 18 శాతం మంది గేమింగ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌గా మారుతుండగా.. మరో 2 శాతం మంది గేమింగ్ యానిమేటర్స్‌గా ఉపాధి పొందుతున్నారు. కాగా, ఆన్‌లైన్ గేమింగ్ ఆడుతున్న వారిలో అత్యధికంగా 92 శాతం మంది వినోదం, మానసిక ఉల్లాసం కోసం ఆడుతున్నట్టు సర్వేలో తేలింది.
మొబైల్ ఫోన్‌లో కంటే కంప్యూటర్‌లోనే గేమింగ్ ఆడేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోందంట. మొబైల్ కంటే పర్సనల్ కంప్యూటర్‌లోనే ఆటలు ఆడటానికి 68 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొబైల్ కంటే కంప్యూటర్‌లో ఆడితే అనుభూతి అధికంగా ఉంటోందని, అందుకనే ఈ మధ్య కాలంలో 39 శాతం మంది మొబైల్ నుంచి కంప్యూటర్‌లోకి ఆటలు ఆడటానికి మారినట్టు సర్వేలో వెల్లడైంది.
పీసీ గేమింగ్‌పై దృష్టి
మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ పీసీ గేమింగ్‌లో మరిన్ని ఆవిష్కరణలు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్‌బేడి తెలిపారు. రాష్ట్రంలో కూడా ఆన్‌లైన్ గేమింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు ఐటీ సంస్థలు ఏర్పాటవుతున్నాయని, విజయవాడ, రాజమండ్రి, విశాఖ కేంద్రంగా 8కి పైగా ఐటీ సంస్థలు ఆన్‌లైన్ గేమింగ్‌లకు వివిధ సేవలను అందిస్తున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు.
ఇప్పుడు లెర్నింగ్ ఆధారిత గేమ్స్‌కు బాగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో అవకాశాలను యువత అందిపుచ్చుకుంటోందన్నారు. వీఎఫ్‌ఎక్స్ యానిమేటర్స్, మెటావర్క్స్‌లో ఏఆర్, వీఆర్, ఎక్స్‌ఆర్ వంటి టెక్నాలజీలకు డిమాండ్ అధికంగా ఉందన్నారు.
ఆన్‌లైన్ గేమ్స్‌తోనే పిల్లల్లో చురుకు
ఈ కాలంలో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి ఉండటంతో వారి మెదడు చురుకుగా పనిచేయడానికి కనీసం రోజుకు గంట లేదా గంటన్నర ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోనివ్వాలి. ఇందుకోసం నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన అటల్ థింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి. విశాఖలోని శ్రీశారద విద్యాలయంలో గల ఏటీఎల్‌లో పిల్లలను 3, 4 వారాలపాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోవడానికి వదిలేసి పరిశీలిస్తున్నారు.
ఎవరైతే ముందుకు వెళ్లలేకపోతున్నారో గుర్తించి వాళ్లకు అనుగుణంగా గేమింగ్‌లో కోడింగ్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను గేమింగ్ రూపంలో చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమవుతోంది.
– రాజశేఖర్ వాసా, ఫౌండర్, స్కెచ్ ఈఏ ఐటీ, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment