సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే అవసరాలకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సర్వేరాళ్ల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తోంది. రీసర్వే తర్వాత నిర్ణయించిన కొత్త సరిహద్దుల ప్రకారం పాతేందుకు అవసరమైన రాళ్ల కోసం వీటిని సిద్ధం చేస్తోంది. రెండు, మూడురోజుల్లో ఒక దాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీసర్వే నేపథ్యంలో రాష్ట్రంలో 1.25 కోట్ల సర్వేరాళ్లు అవసరమవుతాయని సర్వే, సెటిల్మెంట్‌శాఖ అంచనా వేసింది.
అన్ని రాళ్లను సమకూర్చే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలు రాష్ట్రంలోను, సమీప రాష్ట్రాల్లోను లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా సర్వేరాళ్ల కర్మాగారాలు ఏర్పాటు చేసి రాళ్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఆ సంస్థ రాష్ట్రంలోని ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఫ్యాక్టరీల నిర్మాణ పనులు చేపట్టింది. ఒక్కో ఫ్యాక్టరీకి రూ.12.25 కోట్ల చొప్పున రూ.49 కోట్లతో వీటి నిర్మాణం మొదలుపెట్టింది.
రోజుకు ఒక్కో ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం 4,500 రాళ్లు
ఒక్కో ఫ్యాక్టరీని రోజుకు 4,500 రాళ్లను తయారుచేసే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లా బల్లికురువలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది. అతి త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. మే నెలాఖరుకల్లా మిగిలిన యూనిట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇందుకు సంబంధించి స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు ఏపీఎండీసీ ఎండీ, గనులశాఖ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో 4 సర్వేరాళ్ల ఫ్యాక్టరీలు
Published Sun, Apr 17 2022 4:15 AM | Last Updated on Sun, Apr 17 2022 4:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment