
పెందుర్తికి చెందిన మోతి అప్పన్నగా గుర్తింపు
చెల్లా చెదురుగా ఎముకలు, పుర్రె
హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు
కాపులుప్పాడలో కలకలం
విశాఖపట్నం: భీమిలి బీచ్‌రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కలకలం రేపింది. సంఘటనా స్థలంలో పూసలు, సగం కాలిన దుర్గాదేవి ఫొటో, పంచె ఆధారంగా.. ఈ అస్థిపంజరం పెందుర్తికి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న(50)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని ఇక్కడకు తీసుకుని వచ్చి.. హత్య చేసి, అనంతరం కాల్చి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి సీఐ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్‌లతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు అఖిల, భారతి అనే కుమార్తెలు కూడా ఉన్నారు. వీరికి వివాహం అయింది.
9న ఇంటి నుంచి బయటకు వెళ్లి..
వృత్తి రీత్యా ఇంటింటికి వెళ్లి జ్యోతిష్యం చెప్పే అప్పన్న ఈ నెల 9న ఆనందపురం వెళ్తానని ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి తిరిగి రాలేదు. ఈ నెల 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో తన తండ్రి కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో ఆయన కోసం పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు వెతికారు.
అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆనందపురం, బోయపాలెం ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. బోయపాలెం నుంచి కాపులుప్పాడ వైపు ఓ గుర్తు తెలియని వ్యక్తితో అప్పన్న ద్విచక్ర వాహనం(పల్సర్ 220)పై వెళ్లినట్లు గుర్తించారు. దీంతో బోయపాలెం, పరదేశిపాలెం, కాపులుప్పాడ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు వెతికారు. కాపులుప్పాడ ఆర్‌ఎన్‌పీ లేఅవుట్‌లో బుధవారం గాలించగా.. అక్కడ ఓ వ్యక్తి ఎముకలు, పుర్రె వంటివి చెల్లాచెదురుగా కనిపించాయి. వెంటనే దుర్గాప్రసాద్ భీమిలి పోలీసులకు సమాచారం అందించారు.
కాల్ డేటానే కీలకం?
అప్పన్న తమ్ముడు కుమార్తె పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు ఈ నెల 8న అప్పన్న వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లాడు. తిరిగి అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్న అప్పన్న.. ఫోన్లో ఎవరితో గట్టిగా మాట్లాడి వాగ్వాదానికి దిగినట్లు దుర్గాప్రసాద్ తెలిపారు. తమకు ఎటువంటి అప్పులు లేవని, సంతోషంగా జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8వ తేదీన రాత్రి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత రోజున అప్పన్న కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు.
అప్పన్న కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. క్లూస్ టీం వివరాలు సేకరించిందని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అస్థిపంజరాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. అప్పన్న చనిపోయి 4, 5 రోజులు అయి ఉంటుందని, శరీరం సగం కాలడంతో పలు భాగాలను కుక్కలు చెల్లా చెదురుగా తీసుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. భీమిలి సీఐ సుధాకర్ కేసు నమోదు చేశారు.
అప్పన్నగా గుర్తింపు
సంఘటనా స్థలంలో కేవలం పుర్రె, ఎముకలు వంటివి కాలిపోయి ఉన్నాయి. వాటి పక్కనే మెడలో వేసుకునే పూసలు, సగం కాలిన దుర్గాదేవి ఫొటో, పంచె ఆధారంగా కుటుంబ సభ్యులు అప్పన్నగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడకు తీసుకుని వచ్చి, హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment