తిరుమల: తిరుమల జీఎన్‌సీ టోల్‌గేట్ సమీపంలోని నర్సరీలో మంగళవారం ఏడు అడుగుల జెర్రిపోతు భయభ్రాంతులకు గురిచేసింది. నర్సరీలో పనిచేస్తున్న కార్మికులు పామును చూసి, ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు. ఆయన పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో వదిలేశారు.
9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం జరగనున్నది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా పుష్పయాగానికి అంకురార్పణ సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే పుష్పయాగం రోజున కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలు రద్దయ్యాయి.
11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’
తిరుపతి (అలిపిరి): కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో ‘మనగుడి’ నిర్వహించనున్నట్టు టీటీడీ మంగళవారం ఓ ప్రకటలో తెలిపింది. దీన్లోభాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో రెండు చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు, జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment