![AB Venkateswara Rao Another trial Government Of Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/28/Untitled-4.jpg.webp?itok=fZndAVZU)
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలను తోసిరాజని పేట్రేగిపోయిన ఇంటెలిజెన్స్ విభాగం మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావుపై మరో విచారణకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశభద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా.. రక్షణ పరికరాల కొనుగోలులో నిబంధనలకు పాతరేసి అక్రమాలకు పాల్పడినందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆయనను గతంలో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణ సమయంలో ఏబీ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం, పలువురు సీనియర్ అధికారులపై ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం తాజా విచారణకు ఆదేశాలిచ్చింది. ఆలిండియా సర్వీసు (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనలు–1969లోని నిబంధన–8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాకు విచారణ బాధ్యతలు అప్పగించారు. న్యాయవాది సర్వ శ్రీనివాసరావును ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. విచారణ పూర్తి చేశాక ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కాగా, ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలకు సంబంధించి ఫోర్జరీ (నకిలీ) పత్రాలు పెట్టిందంటూ ఏబీ చేసిన ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే సమయంలో ఏబీ సమర్పించిన పలు పత్రాలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మీడియాకు ఏబీ ఇచ్చిన లీకులు, పత్రాలు కూడా తప్పుడివేనని నిర్ధారించింది. తొలి విచారణ జరుగుతున్న సమయంలో హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలనే ఆదేశాలను కూడా ఏబీ ఉల్లంఘించారు.
Comments
Please login to add a commentAdd a comment