సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రధానమైన నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,144.35 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.2,500 కోట్లు కాగా, ఈ ఏడాది కేటాయింపులతో ప్రాజెక్టు పూర్తి కానుంది. దేశ వ్యాప్తంగా రైల్వే 56 ప్రాజెక్టులను ప్రకటించగా.. అందులో ఏపీకి సంబంధించి విజయవాడ–భీమవరం, గుడివాడ–మచిలీపట్నం, నరసాపురం–నిడదవోలు బ్రాంచ్ లైన్ల మధ్య గల 221 కిలోమీటర్ల రైలు మార్గాన్ని చేర్చింది. ఈ ఏడాది జూలై నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుని బడ్జెట్‌లో రూ.1,200 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఈ మార్గంలో 106 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయింది. బడ్జెట్ కేటాయింపుల్ని రైల్వే బోర్డు బుధవారం పింక్ బుక్‌లో చేర్చింది.
వీటికి కేటాయింపుల్లేవ్
భద్రాచలం–కొవ్వూరు,గూడూరు–దుగరాజపట్నం, కంభం–ప్రొద్దుటూరు, కొండపల్లి–కొత్తగూడెం, అమరావతి న్యూ రైల్వే లైన్‌లకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం గమనార్హం. పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, యార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించింది.
విశాఖ రైల్వే జోన్‌కు రూ.40 లక్షలే
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖ కేంద్రంగా రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై ఇంకా చిన్నచూపే కొనసాగుతోంది. జోన్ నిర్మాణానికి రూ.పెద్ద మొత్తంలో నిధులు అవసరమని రైల్వే బోర్డు ప్రతిపాదించినప్పటికీ బడ్జెట్‌లో మాత్రం రూ.లక్షల్లో మాత్రమే కేటాయింపులు చేస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ బడ్జెట్‌లో కచ్చితంగా రైల్వే జోన్ అంశం ప్రస్తావనకు వస్తుందని.. పూర్తిస్థాయి నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. కానీ, బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రస్తావన తీసుకు రాలేదు. కేటాయింపుల పరంగా చూస్తే ఈ జోన్‌కు కేవలం రూ.40 లక్షలు విదిల్చారు. దక్షిణ కోస్తా జోన్ నిర్మాణానికి రూ.169 కోట్లు అవసరమని బోర్డు నియమించిన ఓఎస్‌డీ తన డీపీఆర్‌లో పేర్కొన్నారు. కానీ, గత బడ్జెట్‌లో కేవలం రూ.3 కోట్లు మాత్రమే విడుదల చేసిన కేంద్రం.. ఈ బడ్జెట్‌లో మరింత కోత విధించి రూ.40 లక్షలు మాత్రమే కేటాయించింది.
2022 మార్చిలోపు 56 రైల్వే ప్రాజెక్టులు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాలు పెంచడంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా దేశవ్యాప్తంగా 56 ప్రాజెక్టులను పూర్తిచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ దిశగా రూ.2,15,058 కోట్ల మేర మూల ధన వ్యయాన్ని వెచ్చించనుంది. ఇందుకోసం సాధారణ బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ.1,07,100 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయడంతో పాటు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులపై ఏకకాలంలో పనిచేయడంపై దృష్టి పెట్టనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరణ, టెర్మినల్ వసతులు, రైళ్ల వేగం పెంచడం, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపరచడం, ప్రయాణికుల సౌకర్యాలు, ఆర్వోబీ, ఆర్‌యూబీల ద్వారా భద్రత పనులు చేపట్టడంపై 2021–22 వార్షిక ప్రణాళిక ప్రధానంగా దృష్టిపెట్టనుంది. అలాగే, కొత్త రైల్వే లైన్లకు రూ.40,932 కోట్లు, డబ్లింగ్‌కు రూ.26,116 కోట్లు, ట్రాఫిక్ సౌకర్యాలకు రూ 5,263 కోట్లు, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీల కోసం రూ.7,122 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. కాగా.. ట్రాఫిక్ సౌకర్యాల కేటాయింపులు 156 శాతం పెరిగాయని, కొత్త రైల్వే లైన్ల కేటాయింపులు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 52 శాతం పెరిగాయని రైల్వేశాఖ పేర్కొంది. ప్రజల సౌలభ్యం కోసం 1200కి పైగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్‌ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జ్ (ఆర్‌యూబీ)లను, సబ్‌వేలను ఈ ఏడాది పూర్తిచేయడానికి సిద్ధమైనట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment