సాక్షి, అమరావతి :చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సిŠక్‌ల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేస్తారనే సీఐడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించిన ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
సర్వత్రా తీవ్ర ఆసక్తి కలిగించిన ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు గత నెల 10 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఆయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకించింది.
వాడీవేడిగా వాదనలు..
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వరుసగా మూడ్రోజులపాటు ఇరుపక్షాల న్యాయవాదులు వాడీవేడిగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినపిస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే, సీఐడీ తరపున వాదనలు వినిపించిన ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ విదేశాలకు పరారైన విషయాన్ని పొన్నవోలు ప్రస్తావించారు. గతంలో న్యాయస్థానం ఎదుట 164 సీఆర్‌పీసీ వాంగ్మూలం ఇచ్చిన ఆర్థిక శాఖ రిటైర్డ్ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఇటీవల అందుకు విరుద్ధంగా పలు టీవీ చానళ్లలో మాట్లాడడాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
చంద్రబాబు బెదిరింపులు, ఒత్తిడితోనే వారిద్దరూ పరారయ్యారని, పీవీ రమేశ్ మాట మార్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర సాక్షులను కూడా బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పొన్నవోలు వివరించారు. ఇరుపక్షాల వాదనలను విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు 44 పేజీల తీర్పును వెలువరించారు.
పీటీ వారెంట్లపై విచారణ వాయిదా..
ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో చంద్రబాబును అరెస్టుచేసి విచారించేందుకు పీటీ వారెంట్లను అనుమతించాలన్న సీఐడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. పీటీ వారెంట్లపై రైట్ టు ఆడియన్స్ పిటిషన్ వేశాం కాబట్టి తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద అభ్యంతరం వ్యక్తంచేశారు. పీటీ వారెంట్లపై న్యాయస్థానం ఆదేశాలు సరిపోతాయన్నారు. ఈ అంశంపై న్యాయమూర్తి లేవనెత్తిన సందేహాలకు సీఐడీ తరపు న్యాయవాది సమాధానాలు ఇస్తుండగా.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. న్యాయస్థానాన్ని ఎవరూ శాసించలేరని స్పష్టంచేస్తూ చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇలా అయితే ఈ కేసులను విచారించలేనని.. స్పెషల్ కోర్టుకో వేరే వారికో బదిలీ చేయాలని రిజిస్ట్రీకి చెబుతానన్నారు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు వెనక్కి తగ్గారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలకు అవకాశం ఇచ్చేందుకు కేసు విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు.
మళ్లీ కస్టడీకి నిరాకరణ..
మరోవైపు.. చంద్రబాబును మరోసారి విచారించేందుకు కస్టడీకి అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. గతంలో ఇచ్చిన రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదు కాబట్టి ఆయన్ని మరోసారి విచారించేందుకు మూడ్రోజుల కస్టడీకి అనుమతించాలని సీఐడీ కోరింది. జ్యుడీషియల్ కస్టడీ 15 రోజుల గడువు ముగిసినందున మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబును కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment