విద్యార్థినులతో మాట్లాడుతున్న వీసీ డాక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి
గుంటూరు రూరల్: ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా అభివృద్ధి పరిచిన 24 రకాల నూతన వంగడాలు రైతులకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఉపకులపతి డాక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. హార్టికల్చర్ విశ్వవిద్యాలయం 13 రకాల నూతన వంగడాలను అభివృద్ధి చేసిందన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గుంటూరు నగర శివారు లాం ఫాం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అగ్రిటెక్–2021 ఎగ్జిబిషన్, అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది.
చివరి రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ.. పంటల్లో చీడ పీడలను తట్టుకుని నష్టాలను తగ్గించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడిందన్నారు. అన్ని జిల్లాల నుంచి రోజుకు 6 వేల మంది రైతులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన 15 రకాల నూతన వంగడాలు, హైబ్రీడ్ వంగడాలు, సేంద్రియ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యవసాయ యంత్రాలు, డ్రోన్‌ల ద్వారా వ్యవసాయం, ట్రాక్టర్లు, గొర్రులు, తదితరాలు రైతులను ఆకట్టుకున్నాయి. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు.. రైతులతో చర్చలు జరిపి పంటల మార్పిడి, నూతన వ్యవసాయ విధానాలపై చర్చించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment