అనంతపురం: ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డిజిటల్ ఇన్షియేటివ్స్‌లో భాగంగా ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు నిర్వహించనున్నారు. ఐసీటీ, స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటుకు సమగ్రశిక్ష దన్నుగా నిలుస్తోంది. విద్యారంగంలో ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు అంతర్జాతీయ విద్యనందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సైతం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు అందుకునేలా డిజిటల్ విద్యను వారికి చేరువ చేస్తోంది.
ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని విద్యార్థులను అన్ని విషయాల్లో మేటిగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో దశల వారీగా ఫౌండేషన్ స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలు ఉన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీబీఎస్‌ఈ బోధనకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్టీ) డిజిటల్ కంటెంట్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది.
అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు
2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలో 100లోపు విద్యార్థులు ఉంటే రూ.2.5 లక్షలు, 100 నుంచి 250 మందిలోపు ఉంటే రూ.4.50 లక్షలు, 250 నుంచి 700 మంది ఉంటే రూ.6.4 లక్షల గ్రాంట్‌ను ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ గ్రాంట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుమతులు రాగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 957 ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్‌లు పూర్తిగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, వీజే కనెక్టివిటీ, రికార్డెర్డ్ బోర్డు వర్క్, డిజిటల్ బోర్డును బ్లాక్ లేదా గ్రీన్ బోర్డులుగా మార్చుకోవడానికి అవకాశం, ఆడియో, వీడియోలు ప్రదర్శనకు వీలు, ప్యానల్‌లోనే స్పీకర్ల ఏర్పాటు, స్పెసిఫికేషన్ల ఇంటెల్‌కోర్ ఐ–5, ఏఎండీ రీజెఎన్5 ప్రాసెసర్, కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు.
నాడు–నేడు బడుల్లో చకచకా ఏర్పాట్లు
మనబడి ‘నాడు – నేడు’ కింద తొలి దశ పనులు పూర్తయిన స్కూళ్లలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి డిజిటల్ బోధన చేస్తారు. ఇందులో భాగంగానే స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. 65 ఇంచులతో ఉండే 1,463 స్మార్ట్ టీవీలను ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు.
డిజిటల్ కంటెంట్ సిద్ధం
డిజిటల్ విద్యాబోధనకు వీలుగా విద్యాశాఖ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ సిలబస్‌కు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఈ –కంటెంట్‌ను సీబీఎస్‌ఈ విధానంలో రూపొందిస్తోంది. వీటిలో ఆడియో, వీడియో తరహాలో కంటెంట్ ఉండనుంది.
స్మార్ట్ తరగతులకు చర్యలు
మన బడి ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ తరగతులు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. తక్కిన వాటిలో కొత్తగా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ, స్మార్ట్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి సమగ్రశిక్ష విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇపుడు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 957 స్మార్ట్ తరగతులు రానున్నాయి.
– బి.ప్రతాప్‌రెడ్డి, ఆర్జేడీ, విద్యాశాఖ
Comments
Please login to add a commentAdd a comment