
‘కమిట్‌మెంట్ ఇచ్చినా నువ్వు హీరోయిన్ అయ్యే చాన్సే లేదు. సైడ్ క్యారెక్టర్.. సిస్టర్ క్యారెక్టర్ లాంటివి ట్రై చేస్కో..’ అన్న మాటలు మొదట్లో ఆమెను నిరుత్సాహ పరిచాయి. సినిమా అవకాశాలు అడిగే అమ్మాయిలంటే ఎందుకంత లోకువ? అని తనలో తానే మదనపడింది. కానీ ఆమె లక్ష్యం హీరోయిన్ కావడం. నటనపై తనకున్న ఆసక్తి.. ప్రతిభ.. పట్టుదలతో అవకాశాల కోసం ప్రయత్నించింది. క్రమంగా సినీ అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన ఆమె.. మన విశాఖ అమ్మాయి.. పేరు రేఖ భోజ్.
–సీతమ్మధార(విశాఖ ఉత్తర)
నగరంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 50 వరకు ఆడిషన్స్‌కు వెళ్లింది. అందరూ నయనతారలా ఉన్నావ్ అని అన్నారే తప్పితే అవకాశాలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. అలాంటి సమయంలో రాకేష్‌రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశం కల్పించాడు. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. అలా మొదలైంది రేఖ భోజ్ సినీ ప్రస్థానం.
ప్రస్తుతం హీరోయిన్‌గా ఐదు సినిమాలు పూర్తి చేసింది. మూడు సినిమాలు విడుదలయ్యాయి. మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద బ్యానర్లు, హీరోల సినిమాల్లో చెల్లెల పాత్రలు వచ్చినా ఆమెను అంగీకరించలేదు. ఇంకేదైనా ప్రోత్సాహం ఉండే ఫీల్డ్ ఎంచుకోవచ్చు కదా అన్న తల్లిదండ్రులు థియేటర్‌లో కాలాయ తస్మై నమః సినిమా చూసి ‘గో హెడ్’ అన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ.. రేఖ భోజ్ ముందుకు సాగుతోంది.
షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభం
రాకేష్ రెడ్డి బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జశ్వంత్‌ను హీరోగా, రేఖ హీరోయిన్‌గా ‘లవ్ ఇన్ వైజాగ్’ అనే షార్ట్ ఫిలిం తీశారు. అదే కాంబినేషన్‌లో ‘డర్టీ పిక్చర్’తెరకెక్కించారు. విశాలమైన కళ్లు.. మంచి భావాలు పలికించడం, నటనలో ప్రతిభను గుర్తించిన రాకేష్ తన వరుస ప్రాజెక్ట్‌ల్లో ఆమెను ప్రోత్సహించాడు. తన దర్శకత్వంలో ‘కాలాయ తస్మై నమః’ సినిమాలో అవకాశం కల్పించాడు. 1980 ప్రాంతపు గ్రామీణ నేపథ్యంతో సాగిన ఈ సినిమాలో పని మనిషి పాత్ర రేఖది. ఆ పాత్రలో ఆమె దుమ్ము దులిపేసింది. దీంతో రాకేష్ తర్వాత ప్రాజెక్ట్ రంగీలా(రంజిత–గీత–లాస్య)లో గీత తనే అయింది. మూడో ప్రాజెక్ట్ ‘దామిని విల్లా’లో డైనమిక్ స్త్రీ వాద జర్నలిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తోంది. ఇందులో ఆదిత్య ఓం హీరో. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. రవిశంకర్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ సినిమా స్వాతి చినుకు సంధ్య వేళలో, నిర్బంధం సినిమా ఫేం బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో ఆమె నటించింది. మరో మూడు సినిమాలు కథా చర్చల్లో ఉన్నాయి.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
రేఖ తండ్రి కె.భోజరాజు ఏఆర్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. తల్లి సూర్య కుమారి గృహిణి. రేఖ భోజ్‌కు బీ–ఫార్మసీ చదువుతున్న సోదరి ఉంది. హీరో శోభన్‌బాబుకు ఆమె తల్లి వీరాభిమాని. నిత్యం శోభన్ బాబు సినిమాలు తల్లితో పాటు చూసే రేఖకు సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. సహజ నటన, భిన్నమైన పాత్రల పట్ల ఆసక్తి పెంచుకుంది. నిరీక్షణ సినిమాలో అర్చన పోషించిన పాత్ర అంటే ఆమెకు చాలా ఇష్టం. హీరోల్లో ఫేవరేట్ పవన్ కల్యాణ్, ప్రభాస్, దర్శకుల్లో రాజమౌళి. బిచ్చగత్తె, ట్రాన్స్‌జెండర్, మతి స్థిమితం లేని, దగాపడ్డ మహిళ.. తదితర డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్లు చేయడానికి సిద్ధమే అంటోంది రేఖ భోజ్.
మరిన్ని అవకాశాల కోసం..
తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రవేశం ఉన్న రేఖ మంచి పాత్రలతో కూడిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది. పెద్ద, చిన్న సినిమాలు ఉండవనీ, సక్సెస్ వైపు మాత్రమే సినిమా పరిశ్రమ చూస్తుందని ఆమె అంటున్నారు. ఈ ఏడాదిలో తనవి మూడు సినిమాలు విడుదల అవుతాయని... ఈ సినిమాల ద్వారా మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కథా చర్చలు కొలిక్కి వస్తే ఒకేసారి రెండు, మూడు సినిమాల చిత్రీకరణ ప్రారంభమవుతుందని రేఖ ‘సాక్షి’కి వివరించారు.
ఇది కూడా చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment