సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తాజాగా నటి, ఎంపీ నవనీత్ కౌర్, నటీమణులు రమ్యకృష్ణ, కవిత వంటి వారు రోజాకు మద్దతుగా నిలిచారు. రోజా గురించి ఆ మాటలనడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన నటి, ఎంపీ (మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ నియోజకవర్గం) నవనీత్ కౌర్ బండారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజాకు మద్దతుగా ఆమె తెలుగులో మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. రోజాకు దేశంలోని మహిళా లోకమంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.
‘మహిళా ప్రజా ప్రతినిధిపై ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గులేదా? నీకు ఇంటిలో భార్య, కూతురు, సోదరి వంటి వాళ్లు ఎవ్వరూ లేరా? ఇంత నీచంగా మాట్లాడటానికి నోరెలా వచ్చింది? తెలుగు అమ్మాయిలాగా తెలుగులో మాట్లాడుతుంది, తెలుగు సినిమాల్లో పని చేసింది అంటూ ఏపీ, తెలంగాణ ఎంపీలు నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఎంతో మంది అగ్ర హీరోలతో పని చేసి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన రోజాపై ఇంత దిగజారి మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం కావాలి’ అంటూ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రాజకీయాలు ముఖ్యమా లేక తెలుగు మహిళల గౌరవం ముఖ్యమా అన్నది తేల్చుకోవాలని అన్నారు.
భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలి: కవిత
తెలుగుదేశం పార్టీ నేతలు మహిళలపై దిగజారి మాట్లాడుతున్నారని సినీ నటి, తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత కవిత ధ్వజమెత్తారు. మహిళా మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ అత్యంత హేయంగా మాట్లాడారని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. దరిద్రపు మాటలు ఎలా మాట్లాడారో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు రాజకీయాలను ఇంతలా దిగజారుస్తారనుకోలేదన్నారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ
భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకొనే మన దేశంలోఒక మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ సినీ నటి రమ్యకృష్ణ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్ తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. ఓ మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని చెప్పారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యానారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలి
అల్లూరి జిల్లాలో మహిళల నిరసన.. కొవ్వొత్తుల ర్యాలీ
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): పర్యాటకశాఖ మంత్రి రోజాను అసభ్యకరంగా దూషించిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. బండారు సత్యనారాయణ వైఖరిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యాన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. బండారు ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మంత్రి రోజాతోపాటు మహిళా సమాజానికి బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న బండారు సత్యనారాయణకు టీడీపీ నేతలు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. బండారుపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్‌లు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీకే చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో మహిళా మున్సిపల్ కమిషనర్ను అసభ్య పదజాలంతో దూషించడం, చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేయడం వంటి దారుణమైన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారన్నారు.
వైఎస్సార్‌సీపీ మండల
అధ్యక్షుడు ఎస్.రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, పలువురు నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మంత్రి రోజాను బండారు సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ పాడేరులో కొవ్వొత్తులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పలువురు నేతలు ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment