ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల చేరికలు లేక వెలవెలబోతున్న ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలో విలీనం చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించిన పాఠశాలల విషయంలో అనుసరించాల్సిన కొన్ని విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఈ ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులను వారి తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారు కోరుకునే సమీపంలోని మరో పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలకు సూచించింది. ఈ విద్యార్థులను ఆయా స్కూళ్లలో ఈనెల 31వ తేదీలోగా చేర్పించి ఆ సమాచారాన్ని చైల్డ్ ఇన్ఫోలో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.
ఎయిడెడ్ టీచర్ల బదిలీలకు షెడ్యూల్
ఇలా ఉండగా ఆయా స్కూళ్లలోని ఎయిడెడ్ టీచర్లను వారి సీనియార్టీని అనుసరించి ఇతర స్కూళ్లలో నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేశారు.
షెడ్యూల్ ఇలా..
► జిల్లాల స్థాయిలో టీచర్ల సీనియార్టీ జాబితా రూపకల్పన: అక్టోబర్ 20 నుంచి 22 వరకు
► ఆ జాబితా ప్రదర్శన: అక్టోబర్ 23 సాయంత్రం 5 వరకు
► అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 24 నుంచి 27 వరకు
► అభ్యంతరాల పరిష్కారం, తుది సీనియార్టీ జాబితా ప్రకటన: అక్టోబర్ 31
► యాజమాన్యాల వారీగా ఖాళీల ప్రదర్శన: నవంబర్ 1
► వెబ్ ఆప్షన్ల నమోదు: నవంబర్ 2 నుంచి 5 వరకు
► కేటాయింపు ఉత్తర్వులు విడుదల: నవంబర్ 6
► స్కూళ్లలో రిపోర్టింగ్: నవంబర్ 7
Comments
Please login to add a commentAdd a comment