సాక్షి, విజయవాడ: సాంకేతిక కారణాలతోనే సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం వెనుదిరిగిందని గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీ కాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘‘ప్రతి విమానం బయల్దేరే సమయంలో పూర్తి చెకింగ్ చేస్తాం. చెకింగ్ తర్వాతే విమానం టేకాఫ్ అవుతుంది. చిన్న సాంకేతిక కారణం ఉన్నా ఫ్లైట్‌ను వెనక్కి తీసుకొచ్చేస్తారు. సీఎం విమానం విషయంలోనూ అదే జరిగింది. ప్రయాణీకుల భద్రతే పైలట్ ముఖ్య ఉద్ధేశం. సాంకేతిక లోపం అనేది ఏ టైం లోనైనా రావొచ్చు.. ఏ విమానానికైనా రావొచ్చు’’ అని లక్ష్మీ కాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు.
సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
చదవండి: ‘పట్టు’కుంటే బంగారమే!.. ఏడాదికి రూ.లక్షల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment