AP Government Services Apps: ఒక్క బటన్‌ నొక్కితే చాలు.. ముంగిటికే అన్నీ - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఒక్క బటన్‌ నొక్కితే చాలు.. ముంగిటికే అన్నీ

Published Sat, Aug 28 2021 2:53 AM | Last Updated on Sat, Aug 28 2021 4:22 PM

All Government Services Are Available In The Palm Of Your Hand In Andhra Pradesh - Sakshi

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ యువతి తన స్నేహితురాళ్లతో కలసి ఉదయం వాకింగ్‌ చేస్తుండగా 6.30 గంటలకు ఓ యువకుడు వచ్చి వేధించి తనను ప్రేమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆ యువతి అందుకు నిరాకరించడంతో ఆ యువతి చెయ్యి పట్టుకుని లాగి, దాడి చేశాడు. దాంతో ఆమె మెడ, మొహం మీద గాయాలు అవ్వడంతోపాటు కంటి సమీపంలో రక్తం గడ్డకట్టింది. అతను కత్తి చూపిస్తూ తనను ప్రేమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించి వెళ్లాడు. వెంటనే యువతి 6.45 గంటలకు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కింది. దిశ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది వెంటనే అనకాపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు 6.55 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు.

సాక్షి, అమరావతి: అవసరం ఏదైనా.. ఒక్క బటన్‌ నొక్కితే చాలు ప్రభుత్వ యంత్రాంగం సేవలన్నీ అరచేతిలోకే అందుబాటులోకి వస్తున్నాయి. పౌరసేవల్లో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విప్లవాన్ని తేవడంతో అత్యంత వేగంగా ఫలాలు అందుతున్నాయి. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి తొలగింది. మొబైల్‌ ఫోన్‌లో యాప్‌ ద్వారా సమాచారం అందిస్తే చాలు ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి నిర్దిష్ట సేవలను అందిస్తోంది. ప్రజలకు వ్యయ ప్రయాసలను నివారిస్తూ పౌర సేవలన్నీ సత్వరం, మెరుగైన రీతిలో వారి చెంతకే చేరుస్తోంది. అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేక యాప్‌లను రూపొందించాయి. వీటిని లక్షలాదిగా డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ప్రభుత్వ సేవలను సులభంగా పొందుతున్నారు. ప్రభుత్వ చొరవ పట్ల జాతీయస్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు వ్యయ ప్రయాసలను నివారించి ప్రభుత్వ సేవలను వారి చెంతకే విజయవంతంగా అందిస్తున్న కొన్ని యాప్‌ల గురించి తెలుసుకుందాం. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్‌ బీమా

పోలీసు శాఖ

మహిళా భద్రతకు భరోసా ‘దిశ’


మహిళలు, యువతుల భద్రతకు పూర్తి భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆధునిక సాంకేతిక అద్భుతం ‘దిశ’ యాప్‌. మహిళల మొబైల్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉంటే చాలు పోలీసుల భద్రతా వలయంలో ఉన్నంత సురక్షితంగా ఉండొచ్చు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా.. వేధింపులకు గురైనా యాప్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే చాలు... నిమిషాల్లో పోలీసులు అక్కడకు చేరుకుని భద్రత కల్పిస్తారు. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కేందుకు అవకాశం లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొబైల్‌ ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్‌ కంట్రోల్‌కు సమాచారం చేరిపోతుంది.

ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కినా, మొబైల్‌ ఫోన్‌ను అటూ ఇటూ ఊపినా సరే బాధితురాలి వివరాలు, ప్రస్తుతం ఉన్న ప్రదేశం వివరాలు దిశ కమాండ్‌ కంట్రోల్‌కు తెలుస్తాయి. వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ను సమాచారం అందించి బాధితురాలి రక్షణకు పోలీసులను పంపిస్తారు. ప్రయాణాల్లో రక్షణ కోసం మై ట్రావెల్‌ ట్రాకింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. సమస్యాత్మక ప్రదేశాలను పోలీసు శాఖ జియో ట్యాగింగ్‌ చేసి మహిళలను అప్రమత్తం చేస్తోంది. దిశ  యాప్‌ ద్వారా పోలీసులు రికార్డు స్థాయిలో మహిళల వేధింపులకు సమర్థంగా అడ్డుకట్ట వేస్తున్నారు. మహిళల భద్రతకు ఇంత భరోసా ఇస్తున్నందువల్లే ఇప్పటికే రాష్ట్రంలో 40 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  చదవండి: ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా  

అరచేతిలో స్టేషన్‌.. పోలీస్‌ సేవా యాప్‌


పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు ‘పోలీస్‌ సేవా యాప్‌’ రూపొందించారు. ఫిర్యాదు చేయడం, ఎఫ్‌ఐఆర్‌ కాపీల  డౌన్‌లోడ్, నిందితుల అరెస్టు వివరాలు, పొగొట్టుకున్న పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు, బయట ఊర్లకు వెళ్లాల్సి వస్తే మన ఇంటిపై ప్రత్యేకంగా పోలీస్‌ పహారా కోసం వినతి, వాహనాల దొంగతనంపై ఫిర్యాదులు, ఈ–చలానా వివరాలు, సైబర్‌ భద్రత, సోషల్‌ మీడియాలో పోస్టులపై ఫ్యాక్ట్‌ చెక్, కమ్యూనిటీ పోలీసింగ్, సమీపంలోని ఆసుపత్రులు, బ్లడ్‌ బ్యాంకుల వివరాలు, రహదారి భద్రత, సభలు– సమావేశాలకు పోలీసు అనుమతులు.. ఇలా మొత్తం 87 రకాల పోలీసు సేవలను ఈ యాప్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇంత సౌలభ్యంగా ఉండటంతో పోలీస్‌యాప్‌ను ఇప్పటి వరకు 1.56 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

విద్యా శాఖ

► మనబడికి పోదాం యాప్‌...

రాష్ట్రవ్యాప్తంగా 6 – 14 సంవత్సరాల వయసు కలిగిన బడి బయటి పిల్లలను గుర్తించడం కోసం మనబడికి పోదాం యాప్‌ రూపొందించారు. బడికి దూరమైన పిల్లలను గుర్తించి తగిన తర్ఫీదుతో దగ్గరలోని పాఠశాలలో వయసుకు తగ్గ తరగతిలో చేర్పిస్తారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా చదువు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ యాప్‌లో అలాంటి పిల్లలను గుర్తించడం, స్కూళ్లలో చేర్పించడం లాంటి పనుల సమాచారాన్ని పొందుపరుస్తారు.

  • మనబడి నాడు–నేడు యాప్‌ (ఎస్‌టీఎంఎస్‌)...

మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పది రకాల మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు. పాఠశాలల స్థాయిలో పనుల ప్రగతిని ఈ యాప్‌లో పొందుపరుస్తున్నారు.

  • ఈ– హాజరు యాప్‌..
    ఈ యాప్‌ ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు.
  • దీక్ష..
    విజ్ఞానాన్ని పంచుకునేందుకు డిజిటల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌తో కూడిన వేదిక ఇది. టీచర్లు, స్టూడెంట్ల కోసం దీన్ని రూపొందించారు. ఈ యాప్‌లో పాఠ్యపుస్తకాలను డిజిటలైజ్‌ చేసి పొందుపరిచారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు వివిధ కోర్సులు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

వైద్య– ఆరోగ్య శాఖ

ఐదు రకాల స్పెషలిస్ట్‌ వైద్య సేవలు అందించే ‘ఈ సంజీవని – ఓపీడీ’ యాప్‌

స్పెషలిస్ట్‌ వైద్యుల సలహాలు కావాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ–సంజీవని– ఓపీడీ’ యాప్‌ మీ మొబైల్‌ ఫోన్‌లో ఉంటే చాలు. రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఐదు రకాల స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ఈ యాప్‌ ద్వారా సంప్రదించవచ్చు. స్పెషలిస్ట్‌ వైద్యులు యాప్‌ ద్వారా అందుబాటులోకి వచ్చి తగిన వైద్య సలహాలు ఇచ్చి అనంతరం వైద్యం సాయం అందిస్తారు. అందుకోసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 13 ఈ–సంజీవనీ హబ్‌లను ఏర్పాటు చేశారు. రోగుల పాలిట ఆపద్భంధువుగా మారిన ఈ యాప్‌ విజయవంతమైంది. 2019 నవంబర్‌ నుంచి ఇప్పటివరకు 39 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో కొత్తగా మరో 14 ఈ–సంజీవని హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం 27 హబ్‌లు అవుతాయి.  

వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖలు 

  • ఆర్‌బీ యూడీపీ యాప్‌తో పంటల నమోదు
    విత్తనం నుంచి విపణిలో పంటల విక్రయం వరకు అన్నీ సేవలను యాప్‌ ద్వారా వ్యవసాయ శాఖ అన్నదాతలకు అందుబాటులోకి తెచ్చింది. విత్తనాల కొనుగోలు, పంటల బీమా నమోదు, పెట్టుబడి రాయితీ పొందడం, బ్యాంకు నుంచి రుణాలు, పంటలు నష్టపోతే పరిహారం పొందడం... ఇలా అన్నింటికీ కీలకం ‘పంటల నమోదు’. ఇంత కీలకమైన ఈ–క్రాపింగ్‌ ప్రక్రియను వ్యయ ప్రయాసలు లేకుండా నమోదు చేసేందుకు ‘రైతు భరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం’ పేరుతో యాప్‌ను రూపొందించారు. భూ రికార్డుల ఆధారంగా పంట వివరాలతో ఆన్‌లైన్‌లోనే జియో ఫెన్సింగ్‌ చేస్తారు. విత్తనాలు వేసిన రెండువారాల తర్వాత వీఏఏ, వీహెచ్‌లు పొలాలకు వెళ్లి పరిశీలించి ఫోటో తీసి ఈ యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. అన్నీ పక్కాగా ఉంటే మొబైల్‌కు డిజిటల్‌ రసీదు పంపుతారు. తద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని సేవలను రైతులు పొందేందుకు అర్హులవుతారు. 
     
  • పశు సంరక్షక్‌ యాప్‌ 
    పశువైద్యాన్ని పాడి రైతుల గుమ్మం వద్ద అందించేందుకు పశుసంవర్ధక శాఖ ‘పశు సంరక్షక్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పశువుల నుంచి సేకరించే మూత్రం, పేడను పశువ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపి ఫలితాలను యాప్‌లో నమోదు చేస్తారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రబలే సీజనల్‌ వ్యాధుల గురించి పాడి రైతులు అవగాహన పెంచుకుని నివారణ చర్యలు చేపట్టవచ్చు.
     
  • సీఎం యాప్‌తో పంటలకు మద్దతు ధర

పంటలకు మెరుగైన ధర అందించేందుకు మార్కెటింగ్‌ శాఖ సీఎం యాప్‌ (కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ప్రైస్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ పేమెంట్స్‌) రూపొందించింది. రాష్ట్రంలో వ్యవసాయ పంటల ధరల హెచ్చుతగ్గులను విశ్లేషించడం ద్వారా కనీస మద్దతు ధరను నిర్ణయించడం, నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయడానికి ఈ యాప్‌ దోహదపడుతుంది. 

ఈ–మత్స్యకార యాప్‌
మత్స్య శాఖ అందించే అన్ని సేవలను అనుసంధానిస్తూ ‘ఈ– మత్స్యకార’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ‘అప్సడా’ రిజిస్ట్రేషన్లు, ఇన్‌పుట్‌ సరఫరా, మత్స్య సాగుబడి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్, ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన లాంటి కార్యక్రమాలన్నీ ఈ యాప్‌ ద్వారానే నిర్వహిస్తున్నారు. చేపలు, రొయ్యల చెరువుల నమోదు, వినూత్న ఆక్వా కల్చర్‌ యూనిట్ల నమోదు అంతా ఈ యాప్‌ ద్వారానే జరుగుతోంది. రైతులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ యాప్‌ ద్వారా కల్పించారు. ఈ యాప్‌ ద్వారా క్వాలిటీ ఇన్‌పుట్స్‌ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. జియో ట్యాగింగ్‌ ద్వారా ఈ క్రాప్‌ నమోదు చేస్తున్నారు. విపత్తుల వేళ పంట నష్టాన్ని అంచనా వేసి ఈ యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

విద్యుత్తు శాఖ 

  • విద్యుత్‌ శాఖలో ‘ఈ–విప్లవం’
    రాష్ట్రంలోని 1.89 కోట్ల మంది వినియోగదారులకు సేవలందించేదుకు మూడు విద్యుత్తు పంపిణీ సంస్థలు మొబైల్‌ యాప్‌లు రూపొందించాయి. కొత్త సర్వీసులు పొందడం, బిల్లుల చెల్లింపులు, వినియోగదారుల సేవలు, విద్యుత్తు వినియోగం, చెల్లింపుల వివరాలు, సరఫరా పరిస్థితి, వినియోగించిన విద్యుత్తు వివరాలు, స్వయంగా మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసే సౌలభ్యం తదితర సేవలన్నీ ఈ యాప్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. హెట్‌టీ విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ‘కైజాలా’ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఏ రోజు విద్యుత్తు సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘ఏపీ విద్యుత్‌ ప్రవాహ్‌’ యాప్‌ను తెచ్చారు. విద్యుత్‌ వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌ సదుపాయం ఉంది. 

పురపాలక శాఖ

  • 92 రకాల సేవలు...

నగర, పురపాలికలు, నగర పంచాయతీల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ‘పురసేవ’ యాప్‌
దోహదం చేస్తోంది. ఈ యాప్‌లో మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్, పబ్లిక్‌ హెల్త్, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ ఇలా అన్ని విభాగాలకు సంబంధించి 92 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఫోటోలు, వీడియోల ద్వారా ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేసే సదుపాయం యాప్‌లో ఉంది. ఆస్తి, నీటి పన్నులు ఈ యాప్‌ ద్వారా చెల్లించవచ్చు. యాప్‌ ద్వారా గత నాలుగు నెలలుగా పట్టణ ప్రజల నుంచి అందిన 3, 287 ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించారు. ఎన్నో ఉపయోగాలు ఉన్నందున ఈ యాప్‌ను ఇప్పటివరకు 10.15 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

మహిళా–శిశు సంక్షేమ శాఖ

  • పౌష్టికాహార పంపిణీకి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ యాప్‌

తల్లీబిడ్డలకు పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్‌ నమోదు, పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. అంగన్‌వాడీలకు వ్యాన్ల ద్వారా పాల సరఫరాను పర్యవేక్షించేందుకు ‘మిల్క్‌ యాప్‌’ రూపొందించారు. పాల వ్యాన్లకు జియో ట్యాగింగ్‌ కూడా చేశారు.

24 గంటల్లోపే విత్తనాలు, ఎరువులు
15 ఎకరాల్లో వరి, పసుపు పంటలు వేశా. ఆర్‌బీకే 2.0 యాప్‌ ద్వారా విత్తనాలు, ఎరువులు బుక్‌ చేసుకున్నా. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించా. 24 గంటలు తిరక్కుండానే రైతు భరోసా కేంద్రం సిబ్బంది వాటిని సరఫరా చేశారు. మార్కెట్‌లో దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేకుండాపోయింది.     
    – గుంటక భాస్కరరెడ్డి, రైతు, పెద ఒగిరాల, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement