![All set to Second Phase Panchayat Elections in Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/11/Panchayat-Elections.gif.webp?itok=bV1ArFxX)
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగియగా ఇప్పుడు రెండో దశ ఎన్నికలకు వేళయింది. రెండో దశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈనెల 13వ తేదీన మొత్తం 2,786 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిసి చర్చించారు.
ఈ మలి దశ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. రెండో విడతలో 13 జిల్లాలలోని 18 రెవెన్యూ డివిజన్లలోని మొత్తం 3,328 పంచాయతీలలో 33,570 వార్డుల ఎన్నికకు ప్రకటన విడుదల అయ్యింది. వీటిలో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగనుండగా మొత్తం 7,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డులు 12,605 ఏకగ్రీవమవడంతో మిగిలిన 20,796 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డులకు 44,879 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
అదృష్టం పరీక్షించుకోనున్న అభ్యర్థులు
13 జిల్లాల్లో ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండో విడత ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక ఏజెన్సీలోని పంచాయతీలో ఎన్నికలు మధ్యాహ్నం 1.30 గంటల వరకే ఉంటాయి. ఇక్కడ పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక కూడా అదే రోజు కొనసాగుతుంది. రెండో విడతలో 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్‌లోని 167 మండలాల్లో శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు తొలి విడతలో కౌంటింగ్ నిలిచిపోయిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో కలెక్టర్ ఆదేశాల మేరకు రీ పోలింగ్ నిర్వహిస్తారు.
రెండో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాలు
శ్రీకాకుళం జిల్లా: టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలోని 10 మండలాలు
విజయనగరం జిల్లా: పార్వతీపురం డివిజన్‌లో 15 మండలాలు
విశాఖపట్నం జిల్లా: నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లోని 10 మండలాలు
తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలోని 14 మండలాలు
పశ్చిమగోదావరి జిల్లా: కొవ్వూరు డివిజన్‌లోని 13 మండలాలు
కృష్ణా జిల్లా: గుడివాడ డివిజన్‌లోని 9 మండలాలు
గుంటూరు జిల్లా: నరసరావుపేట డివిజన్ 11 మండలాలు
ప్రకాశం జిల్లా: ఒంగోలు, కందుకూరు డివిజన్లలోని 14 మండలాలు
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు డివిజన్‌లోని 10 మండలాలు
కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 13 మండలాలు
అనంతపురం జిల్లా: ధర్మవరం, కల్యాణదుర్గం డివిజన్‌లోని 19 మండలాలు
వైఎస్సార్ కడప జిల్లా: కడప రెవెన్యూ డివిజన్ 12 మండలాలు
చిత్తూరు జిల్లా: మదనపల్లి రెవెన్యూ డివిజన్ 17 మండలాలు
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్
ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం?
Comments
Please login to add a commentAdd a comment