సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీలోగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న అందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. అదే రోజు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ రోజు అర్ధరాత్రిలోగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదైన వారందరికీ సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. అయితే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7నే వెలువడిన దృష్ట్యా.. ఆ ఎన్నికలకు మాత్రం 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఓటర్లుగా నమోదైన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందన్నారు. అలాగే, మున్సిపల్ ఎన్నికల్లోనూ 9వ తేదీ వరకు ఓటరుగా నమోదైన వారికి ఓటు హక్కు అవకాశం ఉంటుంది.
అనుబంధ ఓటర్ల జాబితాల తయారీ
ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎక్కడికక్కడ గ్రామాల వారీగా 2019 డిసెంబరు 22న గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. అయితే, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొత్త ఓటర్ల జాబితాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. 2019 డిసెంబరు 22 తర్వాత కొత్తగా నమోదైన వారి వివరాలతో పాటు ఈ నెల 7వ తేదీ నాటికి ఓటరుగా నమోదైన వారి పేర్లను కూడా కలిపి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుబంధ ఓటర్ల జాబితాలను తయారుచేస్తోంది. వీరందరికీ ఓటు హక్కు కల్పిస్తారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు కూడా వేర్వేరుగా అనుబంధ జాబితాలను తయారుచేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
పోలింగ్‌కు లక్షన్నరకు పైగా బ్యాలెట్ బాక్స్‌లు..
ఇదిలా ఉంటే.. ఎంపీటీసీ–జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో.. పెద్ద సంఖ్యలో బ్యాలెట్ బాక్స్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్వల్ప వ్యవధిలో మూడు రకాల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున బ్యాలెట్ బాక్స్‌ల కొరత తలెత్తకుండా ఉండేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి అధికారులు వాటిని తెప్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం 1,05,732 బ్యాలెట్ బాక్సులు ఉండగా.. దాదాపు 60 వేల బాక్సులిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. అలాగే, దాదాపు 20 వేల బాక్సులిచ్చేందుకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ముందుకొచ్చాయన్నారు. మరోవైపు.. ఎంపీటీసీ–జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రెండింటికీ లక్షకు పైగా.. సర్పంచి ఎన్నికలకు లక్షన్నర దాకా బ్యాలెట్ బాక్సుల అవసరం ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. దీంతో బ్యాలెట్ బాక్సుల పరంగా ఎటువంటి ఇబ్బందీ ఉండదని అధికారులు భావిస్తున్నారు.
15లోగా ఓటరుగా చేరితే.. సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు
Published Wed, Mar 11 2020 5:39 AM | Last Updated on Wed, Mar 11 2020 5:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment