కోడా చిన్నాలమ్మ, మహిళా రైతు
ఆ వృద్ధురాలికి చదువు లేదు.. సంకల్ప బలం ఉంది ఇంజినీర్లు సైతం సాధ్యం కాదన్నారు.. చిన్నాలమ్మ మాత్రం సాధ్యం కానిదేదీ లేదని నిరూపించింది. అధికారులు సాంకేతిక కారణాలతో చెక్ డ్యాం నిర్మించలేమన్నారు.. ఆ కారణాలకు ‘చెక్’పెడుతూ ‘డ్యాం’ నిర్మించారు.. చేయాలన్న తపన ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించారు. తన ఇద్దరు కుమారులతో కలిసి పంట పొలాలకు నీరందించే భగీరథులయ్యారు.
చదవండి: లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి.. భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి..
సాక్షి, పాడేరు: పెదబయలు మండలంలోని మారుమూల కిముడుపల్లి పంచాయతీకి చెందిన కోడా చిన్నాలమ్మ అనే మహిళా రైతు తోటి గిరిజన రైతులకు ఉపకారిగా నిలిచారు. తనతో పాటు మరికొంత మంది గిరిజన రైతుల సాగు భూములకు నిత్యం అన్ని కాలాల పాటు సాగు నీరు అందే లక్ష్యంగా కంబాలబయలు సమీపంలోని గేదెగెడ్డ వాటర్‌ఫాల్ ప్రాంతంలో మినీ చెక్‌డ్యాంను నిర్మించారు. పూర్వం నుంచి ఈ గెడ్డ వద్ద వృథాగా పోతున్న నీటిని పంట కాలువల ద్వారా దిగువ భూములకు సాగు నీటిని అందించాలని గిరిజనులు కోరుతున్నారు. అయితే వాటర్‌ఫాల్ ప్రాంతం ఎత్తుగా ఉండడంతో పాటు అక్కడ చెక్‌డ్యాం నిర్మించడం కష్టమని గతంలోనే ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. పలుమార్లు ఇక్కడ చెక్‌డ్యాం మంజూరైనప్పటికి సాంకేతిక కారణాలతో పనులు జరగలేదు.
గేదెగెడ్డ వాటర్‌పాల్‌కు ఆనుకుని నిర్మించిన మిని చెక్‌డ్యాం
అయితే కోడా చిన్నాలమ్మ, ఆమె ఇద్దరు కుమారులు కోడా సింహాద్రి, కోడా వరహనందంలు ఇక్కడ మినీ చెక్‌డ్యాం నిర్మాణానికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3లక్షలకు పైగానే సొంత నిధులు ఖర్చుపెట్టి వాటర్‌ఫాల్‌కు ఆనుకుని మినీ చెక్‌డ్యాంను నిర్మించారు. వాటర్‌ఫాల్ నుంచి దిగువుకు పోయే నీటిలో కొంత ఈ చెక్‌డ్యాం చానల్‌లోకి వస్తుంది. అక్కడ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట భూములకు కాలువ ద్వారా నీటిని మళ్లించారు. మట్టి కాలువ తవ్వడంతో పాటు కొంత భాగంలో సిమెంట్ కాంక్రీట్‌తో ప్రధాన కాలువను కూడా నిర్మించారు.
ఆ సిమెంట్ కాలువ దిగువున చిన్నపాటి వంతెన కూడా నిర్మించడంతో ఈ మొత్తం నిర్మాణమంతా అద్భుతంగానే ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణదారులైన కోడా చిన్నాలమ్మకు చెందిన భూములకు కూడా సాగు నీరు అందుతోంది. అలాగే సమీపంలోని మిగిలిన గిరిజనుల భూములకు కూడా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ పంట కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే చేదుపుట్టు సమీపంలోని పంట భూములకు వేసవిలో కూడా సాగునీరు అందించవచ్చని గిరిజనులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మించిన చెక్‌డ్యాం, కాలువ ద్వారా 60 ఎకరాల భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని, వర్షాలు కురవకపోయిన పంటలు పండించవచ్చని స్థానిక గిరిజనులు పేర్కొంటున్నారు.
దశాబ్దాల కల నెరవేరింది :
కంబాల బయలు శివారున తమతో పాటు అనేక మంది గిరిజనులకు వ్యవసాయ భూములున్నాయి. పూర్వం నుంచి అక్కడ భూములకు గేదెగెడ్డ నుంచి సాగు నీరును అందించేందుకు చెక్‌డ్యాం నిర్మించాలని అధికారులను అనేకసార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. తన కుమారుల సహాయంతో సొంతంగానే మిరీ చెక్‌డ్యాం, పంట కాలువలు నిర్మించడం సంతోషంగా ఉంది. చెక్‌డ్యాం నిర్మించాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరింది. ప్రధాన పంట కాలువ ద్వారా అందరి అవసరాలకు సాగునీరును మళ్లిస్తాం.
–కోడా చిన్నాలమ్మ, నిర్మాణ దాత, కిముడుపల్లి
Comments
Please login to add a commentAdd a comment