నాదెండ్ల: ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం అద్భుత ఫలితాలు సాధిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కితాబిచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు సోమవారం ఆమె పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
గ్రామానికి చెందిన నాయుడు కోటయ్య, గొల్లలమూడి తేరేజమ్మ, దావల మరియమ్మ తదితరులు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా.. మంత్రి రజని వారిళ్లకు వెళ్లారు. వారికి అందుతున్న వైద్యసేవపై ఆరా తీశారు. ఫ్యామిలీ డాక్టర్ మీ ఇళ్లకే వచ్చి వైద్యం చేస్తున్నారా, కావాల్సిన మందులిస్తున్నారా, నెలలో ఎన్నిసార్లు వస్తున్నారు, ఏం పరీక్షలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.
‘ప్రతినెలా రెండుసార్లు వస్తున్నారు’
వైద్యులు ప్రతినెలా రెండుసార్లు తమ ఇళ్లకే వచ్చి వైద్యం అందిస్తున్నారని నాయుడు కోటయ్య, గొల్లలమూడి తేరేజమ్మ, దావల మరియమ్మ, వారి కుటుంబ సభ్యులు మంత్రి రజనికి వివరించారు. బీపీ, ఇతర అవసరమైన పరీక్షలు చేస్తున్నారన్నారు. గతంలో ఇలా ఎప్పుడూ లేదని, ప్రభుత్వ వైద్యుడే తమ ఇళ్లకు వచ్చి వైద్యం చేయడాన్ని నమ్మలేకపోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఎంఎల్ హెచ్‌పీ, ఏఎన్‌ఎంలు కూడా నిరంతరం రోగులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
రికార్డులు పక్కాగా నిర్వహించండి
రోగులకు అందిస్తున్న వైద్యానికి సంబంధించి రికార్డులు పక్కాగా నిర్వహించాలని మంత్రి రజని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఓపీ సమయంలో ప్రతి రోగి ఆరోగ్య వివరాలు ఈహెచ్‌ఆర్‌లో నమోదయ్యేలా చొరవ చూపాలన్నారు. ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి ఆరోగ్య సేవలందించే సమయంలో రోగులు, పిల్లలతో ఆప్యాయంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తూబాడు గ్రామంలో ఈ ఒక్కరోజే ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఏకంగా 266 మందికి ఓపీ సేవలు అందించామని చెప్పారు.
ఈ స్థాయిలో గ్రామస్తులకు వైద్య సేవలు గతంలో ఎప్పుడూ అందలేదన్నారు. జగనన్న పరిపాలనలో తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ఒకటని ప్రశంసించారు. మంత్రి స్థానిక వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌కు వెళ్లి 104 వాహనం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను కూడా పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలపై ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను కూడా మంత్రి పరిశీలించారు. చిన్నారులకు నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు.
ప్రజా స్పందన అద్భుతం
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంపై పూర్తిస్థాయిలో ఆరా తీశానని చెప్పారు. వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రజల్లో అద్భుతమైన స్పందన కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల మందికి వైద్య సేవలు అందించామని చెప్పారు. వీరిలో సగానికిపైగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారేనని వివరించారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రభుత్వ సిబ్బంది గ్రామాలకే వెళ్లి ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తారని.. ఎవరికైనా మెరుగైన వైద్యసేవలు అవసరమైతే పీహెచ్‌సీకి సిఫారసు చేస్తారని తెలిపారు. అవసరమైతే సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కూడా పంపిస్తారని వివరించారు. అక్కడ కూడా లొంగని జబ్బు అయితే బోధనాస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి ఆస్పత్రులను అనుసంధానించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment