మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు, చిత్రంలో వ్యవసాయ మిషన్ చైర్మన్ నాగిరెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి : ‘ఎంతో అనుభవజ్ఞులైన లక్షమంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటయ్యాయి. ఇంతపెద్ద వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. వీరి సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు చెయ్యొచ్చు’.. అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ సలహా మండళ్లను వ్యవసాయపరంగా అన్ని అంశాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలందించేందుకే ఈ మండళ్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం 13 జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లతో జరిగిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి కన్నబాబు మాట్లాడారు.
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఏర్పాటుచేసిన ఈ సలహా మండళ్ల సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టుసాగు, చేపలు రొయ్యల పెంపకం తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు సూచనలిస్తే వాటిని సీఎం దృష్టికి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చెయ్యొచ్చన్నారు. సాగుచేసే ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌లో నమోదు చేయించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. బోర్ల కింద వరి పండించకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ–క్రాప్, సీఎం యాప్‌లను మరింత సరళతరం చేసి రైతులకు అర్ధమయ్యేలా చెయ్యాలన్నారు. అనంతరం వ్యవసాయ సలహా మండళ్ల ఆవిర్భావం, ఉద్దేశ్యాలు, బాధ్యతలు తదితర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు.
పంటల ప్రణాళిక, డిమాండ్ మేరకు ఉత్పత్తి, పంటల మార్పు, రైతులకు ఆర్బీకేలో అందుతున్న సేవలు, మార్కెట్ ఇంటెలిజెన్స్, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సలహాలిస్తూ రైతుల్ని చైతన్యపరచాలని సూచనలు చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల కమిషనర్లు అరుణ్‌కుమార్, ప్రద్యుమ్న, శ్రీధర్, అహ్మద్‌బాబు, కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, ఏపీ సీడ్స్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్ ఎండీలు శేఖర్‌బాబు, శ్రీకంఠనాథరెడ్డి, కృష్ణమూర్తి, సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment