సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా ఉత్పన్నమైన గడ్డు పరిస్థితులు, ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకు మించి సవరించిన అంచనాలను ప్రతిపాదించవద్దని ఆర్థిక శాఖ సూచించింది. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా వచ్చే ఆర్థిక ఏడాది (2022 – 23) బడ్జెట్ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో వచ్చే నెల 6వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయంలో భారీ వ్యత్యాసం లేకుండా కచ్చితమైన వివరాలతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మేనిఫెస్టోలో పథకాలు, నవరత్నాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర సాయంతో రాష్ట్ర అభివృద్ధి పథకాలు, విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజెక్టులు, నాబార్డు ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధి పథకాలకు సంబంధించిన పూర్తి డేటాతో బడ్జెట్ ప్రతిపాదనలు అందించాలని పేర్కొంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతోపాటు వేగంగా పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం రహదారులు, రవాణా రంగాలకు ఆస్తుల కల్పన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది.
ఆదాయ వనరులు, ఆదాపై దృష్టి
బడ్జెట్ కేటాయింపులు లేని పనులకు ఎలాంటి బిల్లులను అనుమతించబోమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కొనసాగుతున్న పనులకే బడ్జెట్ ప్రతిపాదనలు అందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లు, సుంకాలు, ఫీజుల ఆధారంగానే రెవెన్యూ రాబడి అంచనాలను రూపొందించాలని, పాత బకాయిల వసూళ్లను కూడా బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొనాలని సూచించింది. వీలైనంత మేర ఆదాయ వనరుల ఆర్జనపై శాఖలు దృష్టి సారించాలని పేర్కొంది. అన్ని శాఖల అధిపతులు వేతనాలు కాకుండా ఇతర అంశాల్లో కనీసం 20 శాతం మేర వ్యయాన్ని ఆదా చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని నిర్దేశించింది.
సంక్షేమానికి ఎప్పటి మాదిరిగానే..
గతంలో మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి ఉప ప్రణాళికల ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్థిక శాఖ పేర్కొంది. మహిళలు, పిల్లల కోసం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని సూచించింది. మహిళల కోసం నూటికి నూరు శాతం కేటాయింపులు, 30 నుంచి 99 శాతం కేటాయింపులు ప్రతిపాదనలను వేర్వేరుగా పంపాలని తెలిపింది. 18 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిగా వంద శాతం, అంతకంటే తక్కువ కేటాయింపుల ప్రతిపాదనలు వేర్వేరుగా సమర్పించాలి. ఆర్ధిక శాఖ అనుమతించిన ఔట్ సోర్సింగ్ కన్సల్టెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలి. ఆర్ధిక శాఖ అనుమతిలేని వాటికి బడ్జెట్ ప్రతిపాదనలు చేయరాదు.
అత్యవసరమైతేనే..
అత్యవసరమైతే మినహా ఎలాంటి సహాయక సిబ్బందిని విభాగాలు ప్రతిపాదించవద్దని ఆర్థిక శాఖ పేర్కొంది. వాహనాల కొనుగోళ్లపై నిషేధం కొనసాగుతుంది. అత్యవసర సర్వీసులకు మినహాయింపు వాహనాల కొనుగోలు ప్రతిపాదనలను పంపకూడదు. మంజూరైన పోస్టులకు వాస్తవ అవసరాల మేరకు వేతనాల బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు అవసరమైన వేతనాలను ప్రతిపాదించాలి. బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయానికి వ్యత్యాసం ఉంటున్న నేపథ్యంలో శాఖలు వాస్తవ నిధుల అవసరాన్ని సరిగా అంచనా వేసి ప్రతిపాదనలు చేయాలి. సబ్సిడీల కోసం అవసరమైన కేటాయింపులను వివరణాత్మకంగా రూపొందించాలి. బకాయి చెల్లింపులకు సంబంధించి ఏదైనా పెద్ద కేటాయింపును ప్రతిపాదిస్తే పూర్తి వివరాలను అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment