సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీని అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. తద్వారా నెలకు రూ.లక్ష జీతం తీసుకునే ఉద్యోగులకు రూ.24 లక్షల మేర లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు నాలుగు డీఏలు, రెండు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. సర్వీసు పెరగడం వల్ల పెన్షన్ రూపేణా ప్రభుత్వ వాటా పెరుగుతుంది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో 10 శాతం స్థలాలను ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిజర్వ్ చేయడంతో పాటు పెన్షనర్లకు కూడా ఐదు శాతం స్థలాలను కేటాయించడానికి అంగీకరించింది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో 20 శాతం రిబేటుతో ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని అర్హులైన వారికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వారికి ఇవ్వడానికి అంగీకరించింది. కారుణ్య నియామకాలను జూన్ 30 లోగా చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే.. వారి కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంటే ఖాళీలు ఉండి, రోస్టర్ ద్వారా నియమించే విధానం అమల్లో ఉండేది. దీని వల్ల కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది.
బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడేవి. ప్రస్తుతం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో బాధిత కుటుంబాలకు వేగంగా న్యాయం జరగుతుంది. శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం వీటన్నింటితో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా, సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అగ్రవర్ణ పేదలకూ సాంత్వన
– రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్లలోపు అగ్రవర్ణ పేద (ఈబీసీ) మహిళలకు కూడా ‘ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థిక సహాయం. ఈనెల 25న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
– ఈబీసీ నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 4,59,328 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత ఉన్న 3,92,674 మంది మహిళలకు రూ.589.01 కోట్లను ప్రభుత్వం సహాయంగా అందజేయనుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 45 నుంచి 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు లబ్ధి కల్పిస్తున్న విషయం తెలిసిందే.
– సీఎం వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 1 నుంచి పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం.
రూ.7,880 కోట్లతో 16 కొత్త వైద్య కళాశాలలు
– రాష్ట్రంలో కొత్తగా రూ.7,880 కోట్లతో 16 వైద్య కళాశాలల నిర్మాణానికి పరిపాలనా అనుమతికి ఆమోదం. ఇదివరకే ఉన్న (పాత) వైద్య కళాశాలలు, అనుబంధ అసుపత్రుల ఆధునికీకరణ, అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.3,820 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చేందుకు అంగీకారం.
– నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు 8 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల మంజూరుకు ఆమోదం.
– ఆయుష్ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టుల మంజూరు. 26 డిస్పెన్సరీల్లో ఒక్కో డిస్సెన్సరీలో ముగ్గురు చొప్పున 78 మంది నియామకానికి అంగీకారం.
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రం నిర్వహణకు టెండర్లు
– 25 ఏళ్ల పాటు కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఆపరేషనల్ మెయింటెనెన్స్ (నిర్వహణ) బాధ్యతలను బిడ్డింగ్ (టెండర్) ద్వారా వేరొకరికి అప్పగించేందుకు ఆమోదం. ప్రస్తుతం ఆ విద్యుత్కేంద్రంలో పని చేస్తున్న జెన్‌కో ఉద్యోగులు తిరిగి జెన్‌కోలోకి వచ్చేందుకు వెసులుబాటు.
– నిర్వహణ వ్యయం అధికంగా ఉండటం వల్ల కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రం వరుసగా నష్టాలు చవిచూస్తోంది. ఈ కేంద్రంలో కిలోవాట్ ఉత్పత్తికి రూ.3.14 వ్యయం అవుతోంది. దాని పక్కనే ఉన్న మరో పవర్ ప్లాంట్‌లో కిలో వాట్ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.2.34 మాత్రమే. ఈ నేపథ్యంలో నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు వేరొకరికి అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ధాన్యం రైతులకు 21 రోజుల్లో చెల్లింపులు
– ధాన్యం కొనుగోళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ (ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్) రూ.5 వేల కోట్ల రుణం తెచ్చుకోవడానికి అనుమతి. కొనుగోలు చేసిన ధాన్యానికిగాను రైతులకు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూసేందుకే ఈ నిర్ణయం.
– ఈ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటి వరకు రూ.4 వేల కోట్ల విలువైన 21.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 21 రోజుల్లోపే రైతులకు రూ.2,150 కోట్లు చెల్లించింది. ఇకపై కూడా రైతులకు 21 రోజుల్లోగా చెల్లింపులు చేయాలని నిర్ణయం.
మరికొన్ని నిర్ణయాలు ఇలా..
– మున్సిపాలిటీగా మారిన వైఎస్సార్ తాడిగడపలో.. పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్న 59 పోస్టులను మున్సిపాలిటీలోకి బదిలీకి ఆమోదం.
– కర్నూలు జిల్లా డోన్‌లో బాలికల బీసీ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ.. బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలలకు 58 పోస్టుల మంజూరుకు అంగీకారం.
– ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) నోడల్ ఏజెన్సీగా ఆటోనగర్‌లలో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించేకుందుకు అవసరమైన గ్రోత్ పాలసీకి ఆమోదం.
– విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్ గృహæ కల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్‌ఐజీ, ఎంఐజీ కాలనీల కోసం వాడుకోవడానికి అంగీకారం.
– తిరుపతిలో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు అకాడమి నెలకొల్పేందుకు 5 ఎకరాల స్థలం కేటాయింపునకు నిర్ణయం.
– ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ పరిధిలో అనకాపల్లిలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (రార్స్)కు 50 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
– దేవాదాయ చట్టం –1987కు సవరణలతో ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. దీని ద్వారా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి సవరణలు తీసుకు రావాలని నిర్ణయం.
– ఓటీఎస్ ఇళ్లు, టిడ్కో, విశాఖలోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ మినహాయింపులకు ఆమోదం.
– ఐసీడీఎస్‌కు బాలామృతం, ఫోర్టిఫైడ్ ఆహారం, తాజా పాలను అమూల్ నుంచి సరఫరాకు ఆమోదం. ఏపీడీడీఎఫ్ (ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్) ద్వారా ఐసీడీఎస్‌కు సరఫరా చేయనున్న అమూల్.
– మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 7 పోస్టుల మంజూరుకు ఆమోదం.
– శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 13 పోస్టుల మంజూరుకు ఆమోదం.
కడప, కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు
కడప, కర్నూలు నుంచి విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కడప విమానాశ్రయం నుంచి కడప – విజయవాడ, కడప – చెన్నై, కర్నూలు విమానాశ్రయం నుంచి కర్నూలు – విజయవాడకు వారానికి 4 సర్వీసులు ఇండిగో నడపనుంది. మార్చి 27 నుంచి సర్వీసులు ప్రారంభం అవుతాయి.
వ్యవసాయ రంగంలో మేటి
– రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల పరిస్థితులపై మంత్రివర్గం చర్చించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (జీజీఐ)లో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
– వ్యవసాయ రంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశు సంవర్థక శాఖలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం అభివృద్ధి సా«ధించింది. పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్)లో అనుసరించిన వినూత్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచింది.
– వినూత్న విధానాల ఫలితంగా ఏపీ ఉద్యానవన శాఖ అగ్రి ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2020–21లో భాగంగా బెస్ట్ హార్టికల్చర్ స్టేట్ ఇన్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. 2019–20తో పోల్చుకుంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 4.7 శాతం నుంచి 2020–21లో 12.3 శాతానికి ఉద్యానవన ఉత్పత్తులు పెరిగాయి.
2 వాయిదాల్లో ఓటీఎస్ చెల్లింపు
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఓటీఎస్ కింద రెండు వాయిదాల్లో.. ఉగాది, దీపావళి పండగల సమయాల్లో చెల్లించే వెసులుబాటుకు మంత్రి మండలి అంగీకరించింది. రుణం చెల్లించకున్నా, అలాంటి ఆస్తి చేతులు మారినా ఒకే స్లాబ్ వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలుగా ఓటీఎస్ చార్జీలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది. గరిష్ట సంఖ్యలో పేదలు లబ్ధి పొందేందుకు వీలుగా ఈ సవరణలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment