సామాజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’ | Andhra Pradesh CM Jagan to unveil 125 foot tall Ambedkar statue in Vijayawada on January 19 | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’

Published Mon, Jan 15 2024 5:57 AM | Last Updated on Mon, Jan 15 2024 8:58 AM

Andhra Pradesh CM Jagan to unveil 125 foot tall Ambedkar statue in Vijayawada on January 19 - Sakshi

‘‘అంబేడ్కర్‌ స్మతివనం చరిత్రాత్మకమైనది. ఇది సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుంది. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప నిర్మాణం ఇది’’  – విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

దేశంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా, ఆంధ్రప్రదేశ్‌ నడిరోడ్డున ఉన్న విజయవాడ నగరంలో సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం ఆవిష్కృతమవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మహోన్నత రూపం ప్రజలకు దర్శనమివ్వబోతోంది. 

► పెడస్టల్‌తో కలిపి 210 అడుగుల ఎత్తయిన నిర్మాణం 
► 18.81 ఎకరాల్లో స్మృతివనం నిర్మాణం 
► రూ.400 కోట్లతో చరిత్రలో నిలిచేలా...
► అంబేడ్కర్‌ ఫొటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు 
► కన్వెన్షన్‌ సెంటర్, ఫుడ్‌ కోర్టులు 

యిర్రింకి ఉమమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్‌ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్‌ పైన 125 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ (సామాజిక న్యాయ మహా శిల్పం)’గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్‌ స్మృతివనం ప్రజల సందర్శనకు సిద్ధమైంది. స్మృతివనాన్ని, అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది. అంబేడ్కర్‌ ఆలోచనలకు అద్దం పట్టే అద్భుత కళాఖండంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

అంబేడ్కర్‌ విగ్రహ పీఠం కింది భాగంలో నిర్మించే భవనంలో అంబేడ్కర్‌కు సంబంధించిన ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు, ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలతో కూడిన గ్రంధాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అవసరమైన జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. అంబేడ్కర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్, కన్వెన్షన్‌ సెంటర్, మినీ థియేటర్, ధ్యాన కేంద్రం కూడా నిరి్మస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, పచ్చటి తివాచీ పరిచినట్టు అందమైన గార్డెన్లు. మ్యూజిక్‌ ఫౌంటెయిన్, వాటర్‌ ఫౌంటెయిన్‌లు, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహం ఎదురుగా కింది భాగంలో గడ్డితో తీర్చిదిద్దిన నెమళ్ల ఆకృతులను సందర్శకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. స్మృతివనం భవనంలో గోడ­లపై స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చాక ఘట్టాలను అపురూప కళాఖండాలుగా ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల ఫొటోలతో కూడిన కళాఖండాలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్మృతివనం చుట్టూ ప్రహరీ మొత్తం రాజ­స్థాన్‌ పింక్‌ కలర్‌ రాళ్లతో అద్భుతంగా నిర్మించారు. అక్కడక్కడా పాల రాతిని ఉపయోగించారు. ప్రహరీ చుట్టూ ఆకట్టుకునే ఆకృతుల్లో వాటర్‌ ఫౌంటేయిన్లు, ఎలివేషన్‌ డిజైన్లతో తీర్చిదిద్దారు. స్మృతివనం చుట్టూ దారి పొడవునా గ్రీనరీ ఉండేలా నిర్మాణాలు చేపట్టారు.  


ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్‌ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం
► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్‌ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది.  
► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్‌ 31న జాతికి అంకితం చేశారు.  
► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని ము చ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు.
► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ )ది.  ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్‌ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్‌ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్‌ నగరంలో ట్యాంక్‌ బండ్‌ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్‌ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్‌ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. 

‘సామాజిక సమతా సంకల్పం’
అంబేడ్కర్‌ స్మృతివనం, విగ్రహం ప్రారం¿ోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తోంది. ‘సామాజిక సమతా సంకల్పం’ పేరుతో ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాయాల్లో ప్లెక్సీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు, సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికార సిబ్బంది భాగస్వాములయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 19న విజయవాడలో ప్రారం¿ోత్సవానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 

దేశంలో మరెక్కడా లేని విధంగా స్మృతివనం 
దేశంలోనే మరెక్కడా లేని విధంగా విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విగ్రహ నిర్మాణం వేగంగానే పూర్తయింది. స్మృతివనం కూడా పూర్తయ్యాకే ప్రారం¿ోత్సవం చేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో అన్ని పనులను అంతే వేగంగా పూర్తి చేశాం. సందర్శకులు ఒక్కసారి స్మృతివనానికి వస్తే అంబేడ్కర్‌ చరిత్ర పూర్తిగా అవగతమయ్యేలా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. గతంలో చంద్రబాబు అంబేడ్కర్‌ స్మృతివనాన్ని అమరావతి రాజధానిలో నిరి్మస్తానని ప్రకటించి దాన్ని గాలికి వదిలేసి దగా చేశాడు. – మేరుగు నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి 

రికార్డు సమయంలో స్మృతివనం పనులు పూర్తి 
అంబేడ్కర్‌ స్మృతివనం పనులు రికార్డు సమయంలో శరవేగంగా పూర్తయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌ మహోన్నత సంకల్పంతో చేపట్టిన ఈ గొప్ప ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఎనలేని కృషి చేశారు. ఈ నెల 19న అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దేశంలోనే ఇది అద్బుత కళాఖండంగా నిలుస్తుంది. ఈ ప్రాంతం గొప్ప దర్శనీయ క్షేత్రంగా మారుతుంది.  – శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 

ఇవీ ప్రత్యేకతలు 
► బేస్‌ (పెడస్టల్‌) 85 అడుగులు (జి ప్లస్‌ టు అంతస్తులు)
► విగ్రహం తయారీకి ఉపయోగించిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ 400 మెట్రిక్‌ టన్నులు 
► 120 మెట్రిక్‌ టన్నుల కాంస్యాన్ని విగ్రహం కోసం ఉపయోగించారు 
► 2,200 మెట్రిక్‌ టన్నుల రాజస్థాన్‌ పింక్‌ ఇసుక రాయి తాపడం 
► కన్వెన్షన్‌ సెంటర్, యాంఫీ థియేటర్‌ 
► మెడిటేషన్‌ సెంటర్‌ 
► విశాలమైన కారిడార్లు (నడక దారులు) 
► పచ్చని గార్డెన్, అందమైన మొక్కలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement