సాక్షి, అమరావతి: పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 2022–23 సీజన్ కోసం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,850లుగా పేర్కొంది. రాష్ట్రంలో పసుపు 30,518 హెక్టార్లలో సాగవుతోంది. ఏటా 3.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కకపోవడంతో 2019–20లో రూ.342.75 కోట్ల విలువైన 50,035 టన్నుల పసువును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది.
ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు మంచి రేటు పలుకుతోంది. గడిచిన సీజన్‌లో రికార్డు స్థాయిలో క్వింటాల్ రూ.7,900కు పైగా పలికింది. ప్రస్తుతం క్వింటాల్ రూ.6,500కు పైగా పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో మార్కెట్‌లో పసుపునకు రేటు పెరిగే అవకాశం కన్పిస్తోంది.
రైతుకు అండగా ఉండేందుకే: మంత్రి కాకాణి
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మద్దతు ధర ప్రకటిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. పసుపు కొనుగోలు కోసం కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.6,850లుగా ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. పసుపు రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment