
దళారీ వ్యవస్థను అరికట్టండి: గవర్నర్
దళారీ వ్యవస్థను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం మార్కెట్ సదుపాయం కల్పించాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు.
అనంతపురం: దళారీ వ్యవస్థను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం మార్కెట్ సదుపాయం కల్పించాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురంలోమాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్నిపెంపొందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు విక్రయిస్తున్న ధరకు, మార్కెట్లో విక్రయిస్తున్న ధరకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పంట పండించిన రైతుకు ఆదాయం దక్కినపుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని గవర్నర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కదిరి జూనియర్ కాలేజ్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎంసెట్, జల వివాదాలు లేకుండా చూడాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మల్యే చాంద్ భాషా గవర్నర్ ను కోరారు. వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థ అరికట్టాలన్న గవర్నర్ సూచనను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.