విజయవాడ రైతు బజార్‌లో నూనె కొనుగోలు చేస్తున్న ప్రజలు.. పక్కనే ధరల బోర్డు.. బహిరంగ మార్కెట్‌లో రూ.265కు అమ్ముతున్న ప్రియా సంస్థ
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పరిణామాల కారణంగా బహిరంగ మార్కెట్‌లో వంట నూనెల ధరలు మండిపోతుండటంతో ఆ సెగ నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తూ రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేపట్టింది. కాగుతున్న నూనెల ధరలను నియంత్రించేందుకు కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సీఎస్ సమీర్‌శర్మ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిత్యం మార్కెట్‌లో వంట నూనెల ధరలను సమీక్షిస్తోంది. మరోవైపు ధరలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను ప్రభుత్వం రంగంలోకి దించింది. రైతుబజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు. గతంలోనూ ఉల్లి ధరలు, టమాటాల రేట్లు భారీగా పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయాలు చేపట్టి వినియోగదారులకు ఊరట కల్పించడం తెలిసిందే.
అది మరింత ‘ప్రియ’ం
ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రభావం పలు రకాల ఉత్పత్తులతోపాటు వంట నూనెలపైనా పడింది. 40 రోజుల క్రితం లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.170–175, పామాయిల్ రూ.158–160, వేరుశనగ నూనె రూ.170–173, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.170– 172 ఉన్నాయి. మార్కెట్‌లో డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధరలపై ప్రముఖ సూపర్ మార్కెట్లలో ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్‌తో విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు ప్రకటించిన ఎమ్మార్పీ ధరలను పరిశీలిస్తే పామాయిల్‌తో సహా నూనెలన్నీ లీటర్ రూ.200 పైనే పలుకుతున్నాయి. మిగిలిన కంపెనీల ధరలతో పోలిస్తే ప్రియా నూనె ధరలు తారస్థాయిలో ఉన్నాయి.
రైతు బజార్లలో ‘విజయ’ నూనెలు
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వంట నూనెలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఏపీ ఆయిల్ ఫెడ్ రంగంలోకి దిగింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. సరఫరాలో ఎక్కడా ఆటంకం లేకుండా విజయ డిస్ట్రిబ్యూటర్లను సమీప రైతుబజార్లతో అనుసంధానించారు. ధరల్లో వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ప్రత్యేకంగా బోర్డులను ప్రదర్శిస్తున్నారు.
ధర తక్కువ.. నాణ్యమైన నూనె
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.200 నుంచి రూ.265 వరకు పలుకుతున్న పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరు శనగ, రైస్‌బ్రాన్ నూనెలను రైతు బజార్లలో రూ.163 నుంచి రూ.178కే అందుబాటులో ఉంచారు. ఎలాంటి కోటా లేకుండా విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 61 ప్రధాన రైతుబజార్లలో విక్రయాలను ప్రారంభించారు. వీటిలో 27 చోట్ల విజయ ఆయిల్ అవుట్‌లెట్స్ ఉండగా మిగిలిన చోట్ల రైతుబజార్లలోని ఇతర దుకాణాల ద్వారా విక్రయిస్తు న్నారు. లీటర్ పామాయిల్ రూ.163, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.178, వేరుశనగ, రైస్‌బ్రాన్ నూనెలు రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆయిల్ ఫెడ్ వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని నిల్వలు సేకరించైనా ప్రజలకు వంటనూనెలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు లభ్యం కావడంతోపాటు నాణ్యత బాగుందని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో వంటనూనెలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి వంట నూనెలు విక్రయిస్తున్నాం. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే లీటర్ రూ.37 నుంచి రూ.87 తక్కువ ధరకే విజయ నూనెలను అందుబాటులో ఉంచాం. ధరలు అదుపులోకి వచ్చేవరకు విక్రయాలు కొనసాగుతాయి.
–చవల బాబూరావు, ఎండీ, ఏపీ ఆయిల్ ఫెడ్
ఇతర కంపెనీలను ప్రోత్సహిస్తే చర్యలు
మార్కెట్‌లో ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా వంట నూనెల విక్రయాలను ప్రారంభించాం. ధరల్లో వ్యత్యాసం తెలియచేసేలా రైతుబజార్లలో బోర్డులు ప్రదర్శిస్తున్నాం. విజయ నూనెలను కాకుండా అధిక ధరలు కలిగిన ఇతర కంపెనీల నూనెల విక్రయాలను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం.
– బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు
నాణ్యత బాగుంది..
రోజురోజుకు పెరుగుతున్న వంట నూనెల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే విజయ నూనె విక్రయాలు చేపట్టటాన్ని స్వాగతిస్తున్నాం. భవానీపురం రైతు బజార్‌లో లీటర్ రూ.170 చొప్పున రెండు వేరుశనగ నూనె ప్యాకెట్లు కొనుగోలు చేశా. నాణ్యత చాలా బాగుంది.
–వి.వెంకటలక్ష్మి, భవానీపురం, విజయవాడ
ఎంతో ఊరట..
మార్కెట్‌లో నూనె ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతు బజార్లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం ఎంతో ఊరటనిస్తోంది. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. భవానీపురం రైతు బజార్‌లో ఆయిల్ చాలా బాగుంది. ఉల్లి, టమాటా ధరలు పెరిగిన ప్పుడు కూడా ఇదే రీతిలో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు.
–వన్నంరెడ్డి సురేష్, రామలింగేశ్వరనగర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment