సాక్షి, అమరావతి: ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఏ విద్యాసంస్థను కూడా ఒత్తిడి చేయడంగానీ, ఈ విషయంలో సమావేశాలు నిర్వహించడంగానీ చేయడానికి వీల్లేదంటూ రాష్ట్రంలోని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్‌జేడీలు), జిల్లా విద్యాధికారులను (డీఈవోలను) రాతపూర్వకంగా ఆదేశించామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. విద్యాసంస్థలను, సిబ్బందిని స్వాధీనం చేయకపోయినా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగుతుందని ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీచేసిన ఆదేశాలను ఆయన హైకోర్టుకు చదివి వినిపించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలుంటాయని తెలిపారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. స్వాధీనానికి ముందుకురాని విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ ఏ అధికారి అయినా స్వాధీనానికి ఒత్తిడిచేస్తే ఆ వివరాలను తమ ముందుంచాలని, తాము తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పిటిషనర్లకు తెలిపింది. ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణంగా జారీచేసిన జీవోను సవాలు చేస్తూ పలు ఎయిడెడ్ విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వానికి స్వాధీనం చేసినా, చేయకపోయినా పాఠశాలలకు ఇస్తున్న గ్రాంట్‌ను నిలిపేసే అవకాశం ఉందన్నారు. దీనివల్ల విద్యాసంస్థలు మూతపడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయమన్నారు. ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ స్పందిస్తూ.. పాఠశాలలు, సిబ్బంది స్వాధీనం స్వచ్ఛందమే తప్ప బలవంతం కాదని చెప్పారు. స్వాధీనం చేయకపోయినా గ్రాంట్ అందుతుందని, గతంలోలాగే ఆ పాఠశాలలు నడుస్తాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది.
స్వాధీనం చేయకపోయినా గ్రాంట్ కొనసాగుతుంది
Published Tue, Oct 5 2021 4:52 AM | Last Updated on Tue, Oct 5 2021 4:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment