సాక్షి, అమరావతి: సాధారణంగా రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలవుతుంటాయి. అందుకే ప్రజలు అలాంటి నాయకులిచ్చే హామీలు అమలవుతాయని పెద్దగా ఆశలు పెట్టుకోరు. కానీ మాట తప్పని, మడమ తిప్పని నైజం.. మాటిచ్చారంటే ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదురైనా వెన్ను చూపని విలక్షణంతో.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అత్యంత అరుదైన నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. చెప్పాడంటే.. చేస్తాడంతే! అనే పేరును తెచ్చుకున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరును ఖరారు చేశారు.
నాటి హామీ ఇలా..
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 2018 ఏప్రిల్ 30న దివంగత ఎన్టీ రామారావు స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరు చేరుకున్నారు. ఆ గ్రామంలో నీరు–చెట్టు పథకంలో తవ్విన చెరువు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న గ్రామస్తుల ఫిర్యాదుతో ఆ చెరువును పరిశీలించారు. గ్రామంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోనూ ముచ్చటించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ‘వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు మారుస్తాను. ఈ ఊరును, ఈ జిల్లాను అభివృద్ధి పరుస్తాను’అని ప్రకటించారు. ఆ రోజు తానిచ్చిన ఆ హామీని అమలు చేస్తూ కొత్తగా ఏర్పాటవుతున్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరిట గెజిట్ విడుదల చేశారు. దీంతో నాడు జగన్ ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా నిలబెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు. నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడు జగనే అంటూ కొనియాడుతున్నారు.
చదవండి: (ఎచ్చెర్ల యథాతథంతో.. టీడీపీ ఎత్తులు చిత్తు)
అసాధారణ నిర్ణయం..
ఎన్టీ రామారావు వైఎస్సార్‌సీపీ నేత కాదు.. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఢీకొడుతున్నారు. అయినప్పటికీ కృష్ణా జిల్లాలో పుట్టిన ఎన్టీఆర్ సినీ రంగంలోను, రాజకీయాల్లోనూ వెలుగొందారు. అందుకే రాజకీయాలకతీతంగా జిల్లాకు ఆయన పేరు పెట్టడం సముచితమని భావించి అప్పట్లో జగన్ ఆ ప్రకటన చేశారు.. ఇప్పుడు అమలు చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో వెలుగొందిన ఎన్టీఆర్ సొంత అల్లుడు చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేసి చూపించారు.
ఆశ్చర్యపరిచింది..
వైఎస్ జగన్ 2018 పాదయాత్రలో నిమ్మకూరు వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చినప్పుడు నమ్మలేకపోయాం. ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం మా అందరినీ ఆశ్చర్యపరచింది. ఇది మా నందమూరి కుటుంబీకులకే కాదు.. మా గ్రామ, జిల్లా వాసులకు ఆనందాన్ని కలిగిస్తోంది. గతంలో ఏ నేత చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు.
– నందమూరి పెద వేంకటేశ్వరరావు, నిమ్మకూరు
వాడుకుని వదిలేశారు
నిమ్మకూరులో పుట్టి పెరిగి చలన చిత్ర రంగంలోను, రాజకీయాల్లోనూ రారాజుగా వెలుగొందిన నేత ఎన్టీఆర్. ఆయన పేరిట జిల్లా ఏర్పడటం చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ పేరును వాడుకున్నారే తప్ప ఆయన గురించి పట్టించుకున్న వారు లేరు. సీఎం జగన్ విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి ఎన్టీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేశారు.
– నందమూరి మన్మథరావు, నిమ్మకూరు
అభిమానుల్లో ఆనందం
విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చెప్పలేనంత సంతోషంగా ఉంది. మన జిల్లాలో పుట్టిన ఆయన, సినీ రంగంతో పాటు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన పేరు ఎప్పుడో పెట్టి ఉంటే బాగుండేది. ఇన్నాళ్ల తర్వాత కార్యరూపం దాల్చడం అభినందనీయం. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానులుగా మేమందరం హర్షిస్తున్నాం.
– ఎం. కుటుంబరావు, సామాజికవేత్త, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment