కూటమి ప్రభుత్వ తీరుపై అధికారవర్గాల్లో విస్మయం
నేడు గ్రామసభల నిర్వహణపై ప్రభుత్వం విస్తృత ప్రచారం
ముందే గుర్తించిన పనులకు ఆమోదం కోసమే గ్రామ సభలు
తమ నేతలకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ఆరాటం
ఇప్పటికే కొనసాగుతున్న పనులు ఇక పక్కకే..
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పనుల్లో ఏమేమి చేయాలో ముందే నిర్ణయించుకుని, వాటికి అధికార ముద్ర కోసం ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం (నేడు) రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామంటూ ఆర్భాటం చేస్తోంది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు తూట్లు పొడుస్తూ గ్రామ సభల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సచివాలయాల భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులన్నింటినీ పక్కనపెట్టి, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరీ నిధులతో కొత్తగా గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు పనులను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధుల నుంచి ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కొత్త పనులు గుర్తింపు ప్రక్రియ అంతా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాదాపు పూర్తయింది. నిజానికి.. ఉపాధి పథకంలో చేపట్టే ఏ పనైనా నిబంధనల ప్రకారం ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలి.
అందుకే కూటమి పెద్దలు తమ వాళ్లకి కట్టబెట్టే పనులకు ఆమోదం తెలపడానికి ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఎందుకీ హడావుడి పవన్.. ఈ ఉత్తుత్తి గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ఎక్కడాలేని హడావుడి చేస్తుండడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాలని పక్షం రోజులుగా పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఆయన సోమవారం అన్ని జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు జరగడం కొత్త కాదని, ఏటా నాలుగు విడతలుగా (ఏప్రిల్ 24న, ఆగస్టు 15న, అక్టోబర్ 2న, జనవరిలో మరో విడత) గ్రామ సభలు జరుగుతూనే ఉంటాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడే ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. 9.92 లక్షల పనులకు జనవరిలోనే ఆమోదం సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల ముందు నుంచే.. పంచాయతీలో చేపట్టాల్సిన పనులు, పేదలకు పనిదినాల కల్పనకు ఉన్న అవకాశాలు గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టి ఫిబ్రవరిలో పూర్తి చేస్తారు. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి లేబర్ బడ్జెట్ రూపకల్పనతో గ్రామాల వారీగా పనుల గుర్తింపు, ఆ పనులకు గ్రామ సభలో ఆమోదం వంటి ప్రక్రియ కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు కల్లా అధికారులు పూర్తి చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూలీలకు కల్పించే పనులతో పాటు మెటీరియల్ నిధులతో చేపట్టే ఇతర అభివృద్ధి పనులన్నీ కలిపి మొత్తం 9.92 లక్షల పనులకు ఈ ఏడాది జనవరిలోనే గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని, ఆ పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పుడే అందజేశారు. అందులో దాదాపు 8.53 లక్షల పనులు పురోగతి దశలో ఉన్నాయి. అయితే, తమ నాయకులకు ఆర్థిక లబ్ధిని చేకూర్చే మట్టి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు కొత్తగా అనుమతులు తెలిపేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది.
Comments
Please login to add a commentAdd a comment