సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడతారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి ఆ పార్టీ ఐటీ విభాగమైన ఐటీడీపీ బాధ్యతలు చూస్తున్న చింతకాయల విజయ్‌ని బాధ్యుడిగా చేస్తూ సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది.
ఈ కేసులో సీఐడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. విజయ్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని విజయ్‌ను ఆదేశించింది. సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన తరువాత మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామంది. ఇలాంటి కేసులో దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులను అడ్డుకునేందుకు నిర్దిష్ట యంత్రాంగం లేదన్న కారణంతో ఇష్టమొచ్చిన పోస్టులు పెడుతూ కొందరు చెలరేగిపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇందుకు హైకోర్టు న్యాయమూర్తులు సైతం బాధితులుగా మారారని తెలిపింది. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని, వీటిపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సీఐడీ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ వేశారు.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ జయసూర్య మంగళవారం విచారణ జరిపారు. విజయ్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్‌తో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. 41ఏ నోటీసు ఇవ్వడానికి పిటిషనర్ ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులు భయానక వాతావరణం సృష్టించారన్నారు. పిటిషనర్‌కు మాత్రం నోటీసు ఇవ్వలేదన్నారు.
సీఐడీ తరపు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. నోటీసు ఇచ్చేందుకే పోలీసులు పిటిషనర్ ఇంటికి వెళ్లారని చెప్పారు. పిటిషనర్‌పై పెట్టిన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని, అందువల్ల అరెస్ట్ చేసే అవకాశం లేదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడతారా?
Published Wed, Oct 12 2022 4:40 AM | Last Updated on Wed, Oct 12 2022 9:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment