సాక్షి, అమరావతి: నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించిన కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (ఆర్‌ఏఆర్‌ఎస్) చెందిన 50 ఎకరాలను ప్రభుత్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవసాయ వర్సిటీ గతేడాది చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఆ భూములను వైద్య కళాశాల కోసం బదలాయించడం ప్రజాప్రయోజనాలకు ఎంతమాత్రం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది.
వ్యవసాయ పరిశోధనతో ముడిపడి ఉన్న ప్రజాప్రయోజనాల కంటే వైద్య కళాశాల ఏర్పాటుతో ముడిపడి ఉన్న ప్రజాప్రయోజనాలు సర్వోత్కృçÙ్టమైనవని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భూమి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఓ విధాన నిర్ణయం తీసుకున్న తరువాత శాఖాధిపతి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వైద్య కళాశాల ఏర్పాటు వంటి ప్రజాప్రయోజనం నిమిత్తం భూమి కేటాయించిన తరువాత ఆ విధాన నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రభుత్వం కింద పనిచేసే అధికారి ప్రభుత్వ నిర్ణయాలను శాసించేందుకు అనుమతించలేమని స్పష్టం చేసింది.
వ్యాజ్యాలివీ..
నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు కోసం ఇతర భూములేవీ లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వ్యవసాయ వర్సిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరథరామిరెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిల్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ‘ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
నంద్యాలలో ఎక్కడా వైద్య కళాశాల ఏర్పాటుకు అనువైన భూమి లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రం భూమిని తీసుకోవాల్సి వచ్చింది. వైద్య కళాశాల కోసం ఇప్పుడు తీసుకున్న 50 ఎకరాల భూమిని వ్యవసాయ పరిశోధన కోసం మాత్రమే కేటాయించారన్న పిటిషనర్ల వాదన సరికాదు. 2015లోనే వ్యవసాయ వర్సిటీకి 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు వైద్య కళాశాల కోసం తీసుకుంటున్న 50 ఎకరాలకు బదులుగా మరో 50 ఎకరాలను అదనంగా ప్రభుత్వం కేటాయించింది.
ప్రజలందరికీ తగిన వైద్య సదుపాయం కల్పించడం సమాజ మౌలిక అవసరం. ప్రతి ప్రభుత్వం కూడా ఇందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. తాము జోక్యం చేసుకోవాల్సినంత ప్రజాప్రయోజనాలు ఈ వ్యాజ్యాలలో లేవని పేర్కొంది. కాగా, కొత్తగా కలెక్టరేట్ కోసం వ్యవసాయ పరిశోధన కేంద్రం భవనాలను వినియోగించుకోవడంపై దాఖలైన పిల్‌ను సైతం కొట్టేసింది.
AP: ప్రభుత్వ నిర్ణయాల్ని ఓ అధికారి శాసించలేరు: హైకోర్టు
Published Thu, Feb 2 2023 3:49 AM | Last Updated on Thu, Feb 2 2023 8:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment