
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలతో పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలు ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను వీలైనంత త్వరగా విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది.
గుంటూరు జిల్లా గురజాల, జంగమేశ్వరపురం గ్రామ పంచాయతీలను విలీనం చేసి గురజాల నగర పంచాయతీగాను.. దాచేపల్లి, నడికుడి గ్రామ పంచాయతీలను విలీనం చేసి దాచేపల్లి నగర పంచాయతీగాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీప గ్రామాలను విలీనం చేసి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఏర్పాటు చేస్తూ మరో జీవో ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికలను నిలువరించేందుకు నిరాకరించగా.. ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదన్న ధర్మాసనం అప్పీళ్లను కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment