సాక్షి, అమరావతి: అమరావతి రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి నుంచి అరసవిల్లి వరకు చేపట్టిన మహా పాదయాత్రలో 600 మంది మాత్రమే ఉండాలంటూ సెప్టెంబర్ 9న ఇచ్చిన ఉత్తర్వులను, ఇతరులెవరూ సంఘీభావం పేరుతో పాదయాత్రలో పాల్గొనరాదంటూ గత నెల 21న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసేందుకు అనుమతి కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.
అప్పీళ్ల దాఖలుకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై వారు దాఖలు చేసిన ప్రధాన అప్పీళ్లను సైతం కొట్టేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రైతు సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ చర్యలకు నిరసనగా చేపట్టిన పాదయాత్రలో పాల్గొనే హక్కు తమకు ఉందన్నారు.
కేవలం 600 మందే పాల్గొనాలన్న ఉత్తర్వులు తమకు అడ్డంకిగా ఉన్నాయన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. మేం కూడా మీ మద్దతుదారులమే అని నిరూపించుకునేందుకు ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు చేస్తుంటారని వ్యాఖ్యానించింది. కేఎస్ మూర్తి స్పందిస్తూ.. యాత్ర చేస్తున్న వారు రైతులని చెప్పగా, రాజకీయ నాయకులెవరో, రైతులెవరో తమకు తెలియదని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీళ్ల దాఖలుకు అనుమతిని నిరాకరిస్తూ అనుబంధ పిటిషన్లతో పాటు ప్రధాన అప్పీళ్లను కూడా కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. తగిన కారణాలతో పూర్తిస్థాయి ఉత్తర్వులను తరువాత వెలువరిస్తామంది.
అమరావతి రైతులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
Published Thu, Nov 17 2022 6:30 AM | Last Updated on Thu, Nov 17 2022 7:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment