
సాక్షి, అమరావతి: విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు సముదాయాన్ని ఈ ఏడాది జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని రహదారులు, భవనాలశాఖ న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. కోర్టు సముదాయాన్ని పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్ కొంత గడువు కోరారని, అందువల్ల జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రహదారులు, భవనాలశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
విజయవాడ బహుళ అంతస్తుల కోర్టు సముదాయం నిర్మాణంలో తీవ్రజాప్యం జరుగుతోందంటూ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. కొత్త కోర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది జూన్‌కల్లా భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ సైతం ఆ గడువు లోపు పూర్తి చేసేందుకు అంగీకరించారన్నారు. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment