సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పలు దేవస్థానాల్లో వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారుచేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవని స్పష్టం చేసింది. వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారుచేయడంపై అభ్యంతరం ఉంటే.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లొచ్చంది. వినతిపత్రం ఇవ్వాలా.. లేదా.. అనేది పిటిషనర్ ఇష్టమంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేవతామూర్తులకు వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారుచేయడం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని, టీటీడీ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పూజారి మేడూరి సాయికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. దేవతామూర్తులకు వినియోగించిన పూలను మరో రకంగా వినియోగించడానికి వీల్లేదన్నారు. ఇలా చేయడం భక్తుల మతవిశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు.
ఇంట్లో వాడుకోవాలన్న ఉద్దేశంతోనే..
పిటిషనర్ వాదనలను టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది సర్వా సత్యనారాయణ ప్రసాద్ తోసిపుచ్చారు. శ్రీవారికి వినియోగించిన పూలను పూల బావిలోనే వేస్తున్నారన్నారు. ఆ పూలను అగరబత్తీల తయారీలో వాడటం లేదని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని పలు దేవస్థానాల్లో వినియోగించిన పూలను అగరబత్తీల తయారీకి వాడుతున్నామన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారం చేసుకుని ఈ వ్యాజ్యం వేశారే తప్ప, ఆగమ శాస్త్ర పండితులతో చర్చించలేదన్నారు. సింహాచలంలో స్వామికి పూసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా అందచేస్తారని తెలిపారు. అలాగే పూలతో చేసిన అగరబత్తీలను ఇంట్లో పూజలకు వాడుకోవాలన్న ఉద్దేశంతో టీటీడీ అగరబత్తీల తయారీకి నిర్ణయం తీసుకుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికున్న విచారణార్హత ఏమిటని ప్రశ్నించింది. పిటిషనర్ హక్కులకు భంగం కలిగి ఉంటే రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలే తప్ప, పిల్ ఎలా వేస్తారని నిలదీసింది. అగరబత్తీల తయారీ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంటూ ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment