కోర్టు ధిక్కార కేసులో.. టీటీడీ ఈఓకు జైలుశిక్ష | TTD EO Dharma Reddy Appeal Before The Bench Against Single Judge judgment | Sakshi
Sakshi News home page

సింగిల్‌ జడ్జి తీర్పుపై ధర్మారెడ్డి అప్పీల్‌

Published Wed, Dec 14 2022 8:37 AM | Last Updated on Wed, Dec 14 2022 8:59 AM

TTD EO Dharma Reddy Appeal Before The Bench Against Single Judge judgment - Sakshi

సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి హైకోర్టు నెలరోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారంపాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 27లోపు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) ముందు లొంగిపోవాలని ధర్మారెడ్డిని ఆదేశించింది. అనంతరం ఆయన్ను జైలుకు పంపా­లని రిజిస్ట్రార్‌కు స్పష్టంచేసింది. ఈ మేర­కు న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మథరావు మంగళవారం తీర్పు వెలువరించారు.

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రో­గ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011 జనవరిలో టీటీడీ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిని రద్దుచేయడంతో పాటు ప్రోగాం అసిస్టెంట్లుగా తమ సర్వీసులను క్రమబద్ధీకరించేలా టీటీడీ అధికారులను ఆదేశించాలని కోరుతూ కొ­మ్ము బాబు, రామావత్‌ స్వామి నాయక్, భూక్యా సేవ్లానాయక్‌లు 2011లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌ 13న తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు టీటీడీ నోటిఫికేషన్‌ను రద్దుచేశారు. అలాగే, పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ టీ­టీ­డీ అధికారులను ఆదేశిస్తూ తీర్పుచెప్పారు. కానీ, ఈ తీర్పుపై టీటీడీ అధికారులు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలుచేశారు.

ఈ నేపథ్యంలో.. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ ఇచ్చిన తీర్పును అధికారులు అమలుచేయడంలేదని కొమ్ము బాబు తదితరులు ఈ ఏడాది జూన్‌ 16న కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ మన్మథరావు విచారణ జరిపారు. టీటీడీ అధికారులు కౌంటర్‌ దాఖలు చేస్తూ, సర్వీసు క్రమబద్ధీకరించాలన్న ఉత్తర్వులపై ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశామని, అందువల్ల ఆ ఉత్తర్వులను అమలుచేయలేకపోయామని చెప్పారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అప్పీల్‌ పేరుతో టీటీడీ అధికారులు ఆరు నెలల గడువు తీసుకున్నారని.. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్నారు. ఒకవేళ తమ ఉత్తర్వుల అమలుకు మరింత గడువు కావాలనుకుని ఉంటే, ఆ విషయంలో కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఉండొచ్చునన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు ధర్మారెడ్డిని బాధ్యుడిగా చేస్తూ అతనికి నెలరోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

జస్టిస్‌ మన్మథరావు ఉత్తర్వులపై ధర్మాసనం స్టే
మరోవైపు.. సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ ఏడాది ఏప్రిల్‌ 13న జస్టిస్‌ మన్మథరావు ఇచ్చిన తీర్పుపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. లంచ్‌మోషన్‌ రూపంలో టీటీడీ అధికారుల అప్పీల్‌ను మంగళవారం ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. టీటీడీ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌. సత్యనారాయణ ప్రసాద్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే విధించింది. అలాగే, ఇదే కేసులో జైలుశిక్ష విధిస్తూ జస్టిస్‌ మన్మథరావు ఇచ్చిన తీర్పుపై ధర్మారెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ శేషసాయి ధర్మాసనం, విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement