
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చి, సమాజంలో మతకలహాలను రేకెత్తించే ఉద్దేశంతోనే ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించినందుకు నమోదైన కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. పోలీసుల చార్జిషీట్ సంతృప్తికరంగా ఉందని ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. పోలీసులు సరైన కోణంలోనే దర్యాప్తు చేశారని, ఈ కేసులో వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసేలా కింది కోర్టును ఆదేశించాలని కోరారు. సుబ్రహ్మణ్యస్వామి అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కేసులో విచారణ పూర్తిచేయాలని కింది కోర్టును ఆదేశించింది.
ఈ ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)లో తదుపరి విచారణ అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. టీటీడీలో అన్యమత ప్రచారమంటూ ‘ఆంధ్రజ్యోతి’ అసత్య కథనం ప్రచురించిందని టీటీడీ విజిలెన్స్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం ప్రచురించిన నేపథ్యంలో ఇలాంటి కథనాలు ప్రచురించకుండా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని, ప్రచురణల విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించకుండా కట్టడి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment