సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్తు కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.2,342 కోట్లకుపైగా ఆదా చేసిందని నీతి ఆయోగ్, ఆర్‌ఎంఐ సంస్థ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవడం, సాంకేతికత ద్వారా మార్కెట్‌లో విద్యుత్తు ధరలను నిశితంగా గమనిస్తూ చౌక కరెంట్‌ను ఎక్కువగా కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదా చేయగలిగింది. తద్వారా ప్రజలపై భారం పడకుండా నివారించగలిగింది. ‘నష్టాల నుంచి పురోగమన బాటలో విద్యుత్తు పంపిణీ రంగం’ పేరుతో రూపొందించిన నివేదికను నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్ కుమార్, ఆర్‌ఎంఐ ఇండియా ప్రిన్సిపల్ అక్షిమా ఘాటే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ..
► డిస్కమ్‌లు చేసే మొత్తం వ్యయంలో 80 శాతం విద్యుత్తు సేకరణపైనే ఉంటుంది. విద్యుత్తు డిమాండ్‌పై తప్పుడు అంచనాలతో డిస్కమ్‌లు ఖరీదైన, దీర్ఘకాలిక థర్మల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. విద్యుదుత్పత్తి చేయనప్పుడు కూడా అదనపు సామర్థ్యానికి సంబంధించి ఫిక్స్‌డ్ ఛార్జీలు చెల్లించాల్సి రావడం అదనపు వ్యయానికి దారి తీస్తోంది. ఫలితంగా మౌలిక వసతులపై పెట్టుబడులు తగ్గిపోయి ఉత్పత్తి సంస్థలకు చెల్లింపుల్లో జాప్యానికి కారణమవుతోంది.
► 12 రాష్ట్రాలలో అధ్యయనం నిర్వహించగా మిగులు విద్యుత్తుపై ఏటా రూ.17,442 కోట్ల మేర ఫిక్స్‌డ్ వ్యయాన్ని చెల్లిస్తున్నట్లు తేలింది. మార్కెట్‌ను సరిగా వినియోగించుకోవడం విద్యుత్తు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఒక కీలక మార్గం. విద్యుత్తు ఎక్సే్ఛంజీల ద్వారా విద్యుత్తు వర్తకంలో వార్షిక వృద్ధి రేటు 23 శాతంగా నమోదైంది.
► సంప్రదాయ దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు బదులుగా స్వల్పకాలిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నట్లు రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్(ఆర్‌టీఎం) సూచికల్లో కనిపిస్తున్న వృద్ధి స్పష్టం చేస్తోంది.
విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం రూపుదాల్చుతోంది. మార్కెట్ బేస్డ్ ఎకనమిక్ డిస్పాచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ (ఎంబీఈడీ) అనే నూతన విధానంలో స్థిర దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా జరిగే అమ్మకాలు, కొనుగోళ్లు సహా అన్ని విద్యుత్తు లావాదేవీలను విద్యుత్తు ఎక్సే్ఛంజీలకు మళ్లించనున్నారు. ఫిక్స్‌డ్ కాస్ట్ చెల్లింపు కొనసాగినప్పటికీ వేరియబుల్ కాస్ట్ తగ్గుతుంది. భవిష్యత్తులో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల అవసరాన్ని ఇది తగ్గిస్తుంది.
► విద్యుత్తు కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్ రూ.2,342 కోట్ల మేర ఆదా చేసింది. 2019–21 మధ్య రెండేళ్లలో విద్యుత్తు కొనుగోళ్లలో అనుకూల విధానాల ద్వారా ఇది సాధ్యమైంది. బహిరంగ మార్కెట్లలో విద్యుత్తు కొనుగోలు చేయడం కూడా ఇందులో భాగం. పలు రాష్ట్రాలు సబ్సిడీలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్నాయి. దీనివల్ల విద్యుత్తు లీకేజీ, డిస్కమ్‌లకు నష్టాలు వాటిల్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ నష్టాలను నివారించేందుకు వ్యవసాయానికి ప్రత్యేకంగా విద్యుత్తు ఫీడర్లను అమర్చాయి. వ్యవసాయానికి సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తూ డిస్కమ్‌లు సేకరణ వ్యయాన్ని తగ్గించుకున్నాయి.
► దీర్ఘకాలిక, ఖరీదైన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకుని డిస్కమ్‌లు ఇరుక్కుపోయాయి. తక్కువ వ్యయంతో విద్యుత్తు మార్కెట్లో లభ్యమైనంత కాలం డిస్కమ్‌లు కొత్తగా ఖరీదైన దీర్ఘకాలిక పీపీఏలను కుదుర్చుకోరాదు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలు 2022 వరకు కొత్త థర్మల్ పీపీఏలను నిషేధించాయి. సాధ్యమైన చోట డిస్కమ్‌లు ఖరీదైన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల నుంచి వైదొలగవచ్చు.
పంపిణీ రంగం కీలకం..
‘వ్యాపారాన్ని సులభతరం చేయడం, జీవిత సౌలభ్యాన్ని మెరుగుపరచేందుకు సమర్థవంతమైన పంపిణీ రంగం అవసరం. విద్యుత్తు పంపిణీ, సేకరణ, పర్యవేక్షణ, పునరుత్పాదక ఇంధన శక్తి సమీకృతం, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ తదితర అంశాల్లో ప్రైవేట్ రంగాల పాత్ర లాంటి వాటిని ఈ నివేదిక విశ్లేషించింది’
– రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
నష్టాల అంచనా రూ.90 వేల కోట్లు
‘దేశంలో చాలా డిస్కమ్‌ల నష్టాలు 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్లు వరకు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. సంచిత నష్టాల కారణంగా విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కమ్‌లు సకాలంలో బకాయిలు చెల్లించలేకపోతున్నాయి. పంపిణీ రంగాన్ని సమర్థ, లాభదాయక బాట పట్టించడం, సంస్కరణల ఎంపికలో నివేదిక ఉపకరిస్తుంది’
– వీకే సారస్వత్, నీతి ఆయోగ్ సభ్యుడు
దీర్ఘకాలిక విధానాలు అవసరం..
‘డిస్కమ్‌ల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక విధానాలతోపాటు సంస్థాగత, నిర్వాహక, సాంకేతిక సంస్కరణలు అవసరం’
– క్లే స్ట్రేంజర్, ఆర్‌ఎంఐ మేనేజింగ్ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్‌లో ఆదా ఇలా
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించేలా చర్యలు చేపట్టారు. నిర్వహణ వ్యయంలో 80 శాతం విద్యుత్ కొనుగోలు ఖర్చే ఉంటుంది. మార్కెట్లో విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చౌకగా లభించే సమయంలో ఎక్కువగా తీసుకునేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. రియల్ టైం విధానం వల్ల ప్రతి 15 నిమిషాలకు ఒకసారి జాతీయ స్థాయిలో విద్యుత్ ధరలను అంచనా వేసే వీలుంది. ఈ సదుపాయాన్ని విరివిగా ఉపయోగించుకునే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని బలోపేతం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, మార్కెట్లో లభ్యతను శాస్త్రీయంగా గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment