సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేసూ్తనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. కాగా, 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి.. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
‘టెట్’ నిబంధనల సడలింపు..
ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్–2024 నోటిఫికేషన్‌కు ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువమంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశముంటుంది. అలాగే..
- ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్/సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి.
- దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు.
- అయితే.. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపునిచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment