సాక్షి, అమరావతి : విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన సులభతర వాణిజ్య విభాగంలో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – ఈవోడీబీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. 2019 సంవత్సరానికి గాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా సులభతర వాణిజ్యం కోసం నిర్దేశించిన 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. గతేడాది 12వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 10 స్థానాలు ఎగబాకి రెండవ స్థానంలోకి రాగా, రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది మూడో స్థానానికి పరిమితమైంది. శనివారం న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవోడీబీ–2019 ర్యాంకులను విడుదల చేశారు.
► తొలిసారిగా పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను తీసుకొని ప్రకటించడం ఈ ర్యాంకుల ప్రత్యేకత. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు అమలు చేసినట్లు ధృవీకరణ పత్రం ఇస్తే దాని ఆధారంగా ర్యాంకులు ప్రకటించేవారు. కానీ ఇప్పుడు ఈ సంస్కరణలు అమలు అవుతున్నాయా లేదా అన్న విషయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి ర్యాండమ్‌గా డీపీఐఐటీ, ప్రపంచ బ్యాంకు సర్వే చేసి ఈ ర్యాంకులు ప్రకటించాయి.
► కోవిడ్–19 వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకు ఎక్కింది.
సమస్యల పరిష్కారానికి ఔట్ రీచ్
► వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో ఈ సంస్కరణల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
► పారిశ్రామిక వేత్తల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ –2019 నుంచి జనవరి 2020 మధ్య హిందూపురం, విశాఖ, విజయవాడ పట్టణాల్లో ఔట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేరుగా 8,000 మంది పారిశ్రామిక వేత్తలను కలిసి వారి సమస్యలను పరిష్కరించింది.
► వాణిజ్య వివాదాలను త్వరతగతిన పరిష్కరించడానికి విశాఖ, విజయవాడల్లో ప్రత్యేక వాణిజ్య కోర్టులను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2015 సింగిల్ డెస్క్ పాలసీని పూర్తిగా సవరించడంతో పాటు, పరిశ్రమలకు భూ కేటాయింపులను సింగిల్ డెస్క్ ద్వారా నిర్ధిష్ట కాలపరిమితిలో ఇచ్చే విధంగా నిబంధనలు తీసుకువచ్చింది.
► ఆన్‌లైన్ ద్వారా ఔషధాల అమ్మకాల లైసెన్స్‌కు దరఖాస్తు చేయడం, ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ 1988 చట్ట ప్రకారం రెన్యువల్ చేసుకునే విధానం నుంచి అన్ని షాపులకు మినహాయింపు ఇవ్వడం, కార్మిక చట్టాలు, బాయిలర్ చట్టాల్లో పలు సంస్కరణలు తీసుకు వచ్చింది.
సీఎం జగన్‌పై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగింది
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శక పాలనపై పారిశ్రామికవేత్తల నమ్మకానికి ఈ ర్యాంకులే నిదర్శనం. తొలిసారి సర్వే ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో మొదటి స్థానం సాధించడం పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సలభతర వాణిజ్యం కోసం పారిశ్రామిక సంస్కరణల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కోవిడ్–19 సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించడంతో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంపై మరింత నమ్మకం పెరిగింది.
– మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
సంస్కరణలను పాటించడం వల్లే..
ఈ ఏడాది సులభరత వాణిజ్యం కోసం ప్రవేశపెట్టిన 187 సంస్కరణలను కచ్చితంగా పాటించాము. ప్రతి సంస్కరణ అమలు తీరుపై కనీసం 100 మంది పారిశ్రామికవేత్తల అభిప్రాయలు తెలుసుకున్నాకే ఈ ర్యాంకులు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈ సర్వే నిర్వహించారు. కనీసం 70 శాతం మంది అనుకూలంగా చెప్పకపోతే ఒక్క పాయింటు కూడా రాదు. అలాంటింది మొదటి ర్యాంకు వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలను ఏ విధంగా అమలు చేసిందో ఇట్టే తెలుస్తోంది.
– జవ్వాది సుబ్రమణ్యం, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment