మూగజీవాలకు అంబులేటరీ క్లినిక్స్‌ | Animal Husbandry Dept Mobile Ambulatory Clinics In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మూగజీవాలకు అంబులేటరీ క్లినిక్స్‌

Published Sun, Jan 30 2022 10:36 PM | Last Updated on Mon, Jan 31 2022 8:31 AM

Animal Husbandry Dept Mobile Ambulatory Clinics In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. అంటూ ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా క్షణాల్లో రయ్‌ రయ్‌మంటూ వస్తున్న æ‘108 అంబులెన్స్‌’ తరహాలో ఇప్పుడు మూగజీవాలకు ఏ చిన్న కష్టమొచ్చినా  ‘అంబా.. అన్న సైరన్‌తో పరుగులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి ‘డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ’ (మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌) రథాలు.

వైద్య సేవలతో పాటు అవసరమైతే సన్నజీవాలు, పెంపుడు జంతువులకు సర్జరీలు చేయడమే కాదు.. కోలుకునే వరకు వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి. మైదాన ప్రాంతాల్లో నియోజకవర్గానికి రెండు, గిరిజన ప్రాంతాల్లో ఒకటి, అర్బన్‌లో కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబవుతున్న ఈ వాహనాలు వచ్చేనెల నుంచి సేవలందించబోతున్నాయి. 

వైద్యం అందక ఏ మూగజీవి చనిపోకూడదని.. 
రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 కోట్ల గొర్రెలు, 55.22 లక్షల మేకలు, 92వేల పందులతో పాటు 10.79 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది. వాటి కోసం రెండు సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ ఆస్పత్రులు, 12 వెటర్నరీ పాలీ క్లినిక్స్‌ (వీపీసీ), 323 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు (ఏవీహెచ్‌), 1,576 వెటర్నరీ డిస్పెన్సరీలు (వీడీ), 1,219 రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్‌లు (ఆర్‌ఎల్‌యూ) సేవలందిస్తున్నాయి.

అయితే.. మారుమూల ప్రాంతాల్లో ఉండే వందలాది మూగజీవాలకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సకాలంలో వైద్యసేవలు అందడంలేదు. ఈ నేపథ్యంలో.. వైద్యసేవలందక ఏ ఒక్క మూగజీవి చనిపోకూడదన్న సంకల్పంతో 108, 104 తరహాలోనే దేశంలోనే మరెక్కడా లేని విధంగా జిల్లాకొకటి చొప్పున ‘సంచార పశు వైద్యశాల’లను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాల కోసం టెండర్లను ఆహ్వానించింది. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి రెండు, పశు సంపద తక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఒకటి, నగర ప్రాంతాల్లో ఉండే మూగజీవాలు, పెంపుడు జంతువుల కోసం కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 340 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తొలి విడతగా వచ్చే నెలలో 175 అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఒక్కో అంబులెన్స్‌ తయారీకి రూ.37లక్షల చొప్పున మొత్తం రూ.125.80 కోట్లు ఖర్చుచేయనుంది. ఇక దీనిని గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలోనూ అమలుచేయాలన్న ఆలోచనతో లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికొకటి చొప్పున అంబులెన్స్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది.  

అంబులెన్స్‌ ప్రత్యేకతలు.. 
ఇందులో డ్రైవర్‌ కమ్‌ అటెండర్, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ కమ్‌ కాంపౌండర్, ఓ వైద్యుడు ఉంటారు.  
 జీతభత్యాలు, నిర్వహణ కోసం ఒక్కో అంబులెన్స్‌కు ఏటా రూ.18.72లక్షల చొప్పున రూ.63.65 కోట్లు ఖర్చుచేయనుంది.  
 ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేస్తున్న వీటిని ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ బాధ్యతలను టెండర్‌ ద్వారా ఎంపిక చేసిన ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తోంది.  
 ప్రతీ అంబులెన్స్‌లో ప్రత్యేకంగా ట్రావిస్‌తోపాటు 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన పూర్తిస్థాయి ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నారు.  
అలాగే, కనీసం వెయ్యి కిలోల బరువున్న మూగజీవాలను తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్‌ జాక్‌లిఫ్ట్‌ సౌకర్యం కూడా ఏర్పాటుచేశారు.  
 సీజన్ల వారీగా వేసే వ్యాక్సినేషన్స్‌తో పాటు అన్ని రకాల రోగాలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతారు. చిన్నపాటి సర్జరీలూ అక్కడికక్కడే.. సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు చిన్నపాటి సర్జరీలు కూడా ఎక్కడికక్కడే చేస్తారు.  
పెద్ద జంతువులకు ప్రాథమిక వైద్యంతో పాటు చిన్నపాటి ఆపరేషన్లు చేస్తారు.  
పెద్ద సర్జరీలు అవసరమైతే మాత్రం సమీప ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఆ గ్రామానికి తీసుకెళ్లి రైతుకు అప్పగిస్తారు.  
 వీటి కోసం 24 గంటలూ పనిచేసేలా టోల్‌ ఫ్రీ నెం.1962ను ఏర్పాటుచేస్తున్నారు.  
ఇక 108లోని కుయ్‌ కుయ్‌ తరహాలో వీటికోసం ‘అంబా..’ అన్న పశువుల అరుపుతో పాటు వాటి మెడలో కట్టే మెడపట్టెడ (గంటలు, మువ్వలు) శబ్ధంతో కూడిన వినూత్న సైరన్‌ రూపొందించారు.

రోల్‌మోడల్‌గా నిలిచాం 
సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనకనుగుణంగానే దేశంలోనే తొలిసారిగా వెటర్నరీ అంబులెన్స్‌లు తీసుకురావాలని నిర్ణయించాం. మన ప్రయత్నాన్ని మెచ్చుకున్న కేంద్రం జాతీయ స్థాయిలో అమలుకూ ముందుకొచ్చింది. మూగజీవాల పరిరక్షణే ధ్యేయంగా నియోజకవర్గానికి రెండు చొప్పున అంబులెన్స్‌ తీసుకొస్తున్నాం. వైద్యసేవలందక ఏ మూగజీవి చనిపోకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం.
 – డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖ మంత్రి

ఇక పశు ఆరోగ్య సేవా రథాలు 
ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో పశు వైద్య సేవలందిస్తున్నాం. పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 108, 104 తరహాలో ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు వచ్చేనెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.  
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, పశు సంవర్ధక శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement