
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నిర్వహణ నియమావళి(ఆపరేషన్ ప్రోటోకాల్), బోర్డు ఉత్తర్వులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కారు నీటిని తరలిస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసింది. దీనివల్ల శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులకంటే దిగువ స్థాయికి చేరుకుంటోందని, ఫలితంగా చెన్నైకి తాగునీటితోపాటు రాయలసీమ సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసేలా తెలంగాణ సర్కారును ఆదేశించాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్(ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి తాజాగా లేఖ రాశారు.
నిబంధనలను తెలంగాణ తుంగలో తొక్కుతోంది..
‘‘సెప్టెంబర్ 28, 2004న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 107 ప్రకారం శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 854 అడుగులు. ఆ నీటిమట్టాన్ని పరిరక్షించాలి. ఇక శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపులో మొదటి ప్రాధాన్యం చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం.. రెండో ప్రాధాన్యం హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేయడం.. మూడో ప్రాధాన్యం నీటి లభ్యత ఉంటే విద్యుదుత్పత్తి చేయడం.. నాలుగో ప్రాధాన్యం సాగర్, ప్రకాశం బ్యారేజీల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885 అడుగులున్నప్పుడు.. కుడిగట్టు కేంద్రంలో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తిని ప్రారంభించాక ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయాలి.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని చెరిసగం పంచుకునేలా ఇరు రాష్ట్రాలమధ్య ఒప్పందం కుదిరింది. కానీ తెలంగాణ సర్కారు ఆపరేషన్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ విద్యుదుత్పత్తి చేస్తోంది. విద్యుదుత్పత్తి నిలుపుదల చేయాలని బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను ఖాతరు చేయట్లేదు. దీనివల్ల శ్రీశైలం నీటిమట్టం తగ్గిపోవడంతో చెన్నైకి తాగునీటి, రాయలసీమ సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ సీజన్ ప్రారంభంలోనూ బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ విద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రారంభించింది. ఫిబ్రవరి 18న జరిగిన బోర్డు సమావేశంలో విద్యుదుత్పత్తికి చెరి సగం నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ అంగీకరించింది. కోటా దాటినా ఎడమగట్టు కేంద్రంలో రోజూ 12 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతూ విద్యుదుత్పత్తి చేస్తోంది. తక్షణమే విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసేలా తెలంగాణను ఆదేశించండి’’ అని లేఖలో ఈఎన్‌సీ కృష్ణాబోర్డుకు విజ్ఞప్తి చేశారు.