సాక్షి, అమరావతి: మూడేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజాభ్యుదయమే లక్ష్యంగా తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, వికేంద్రీకరణ దిశగా వేసిన అడుగుల గురించి నేడు అసెంబ్లీ వేదికగా చర్చించనుంది. వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించనుంది. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని, అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ తీసుకున్న నిర్ణయాలను, రాబోయే కాలంలో చేయనున్న మేలును, ప్రతిపక్షం తీరును మరోమారు ప్రజల దృష్టికి తీసుకెళ్లనుంది. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా సాకారం చేసిన మహా సామాజిక విప్లవం గురించి మాట్లాడనుంది.
కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని చాటనుంది. 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని చేకూర్చారు. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక.. ఎన్నికల మేనిఫెస్టో అమలు, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించారు. ఇప్పటికే 98.44 శాతం హామీలను అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. 1.30 లక్షల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించారు. ఇటీవల వీరి ప్రొబేషన్ కూడా పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో వేతనాలు ఇస్తున్నారు. ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాల స్థానంలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలనను వికేంద్రీకరించారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (నగదు బదిలీ) రూపంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.65 లక్షల కోట్లు జమ చేశారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.
అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా ఆసరా
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణ మాఫీ హామీ ఇచ్చి, మహిళల ఓట్లు వేయించుకుని గద్దెనెక్కారు. ఆ తర్వాత ఆ హామీ గురించి పూర్తిగా విస్మరించారు. బాబు దెబ్బకు డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యమైపోయాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ పరిస్థితిలో తన పాదయాత్రలో అక్కచెల్లెమ్మల కష్టాలు కళ్లారా చూసిన వైఎస్ జగన్ వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు.. ఎన్నికల నాటి వరకు బ్యాంకుల్లో ఉన్న వారి అప్పులను నాలుగు విడతలుగా చెల్లిస్తూ వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేశారు. దీనికి తోడు 45 ఏళ్ల వయసు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750.. వరుసగా నాలుగేళ్లు ఇస్తూ వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండు పథకాలతో పాటు ఇతరత్రా ప్రభుత్వ సాయం వల్ల మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేలా చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ.. కార్పొరేట్ కంపెనీల ద్వారా సహకారం అందిస్తూ పలు చర్యలు తీసుకున్నారు.
పండుగలా వ్యవసాయం.. కాదనగలరా?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఒక దశలో వ్యవసాయం దండగ అని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ‘బాబు మాటలు తప్పు’ అని నిరూపిస్తూ విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చారు. రైతు భరోసా పథకంతో రైతన్నలకు పెట్టుబడి సాయం అందిస్తూ వస్తున్నారు. 10,750 ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)లు ఏర్పాటు చేసి రైతులకు విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అండగా నిలుస్తున్నారు.
పంటకు నష్టం చేకూరితే లబ్ధి చేకూర్చడానికి ఈ–క్రాప్ ద్వారా భరోసా ఇస్తున్నారు. అన్ని ఆర్బీకేల్లోనూ పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో పరికరాలు ఏర్పాటు చేశారు. 7.13 లక్షల మంది రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందజేసేలా కార్యాచరణ రూపొందించారు. కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌లు, గోదాముల నిర్మాణం సత్వరమే పూర్తి చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నారు.
మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్..
‘పేద పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువు మాత్రమే. వారిని ఉన్నత చదువులు చదివిస్తే అది వారి తల రాత మారుస్తుంది’ అని గట్టిగా నమ్మిన సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్, బైజూస్‌తో ఒప్పందం, ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, బై లింగువల్ టెక్టŠస్ బుక్స్ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు స్కిల్స్ అప్‌గ్రేడేషన్ ప్రొగ్రాం, ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో మార్పులు చేపట్టారు.
ఇలా వీటన్నింటి కోసం ఈ మూడేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.53 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. 2025లో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యేలా ఈ నవంబర్‌లో 8వ తరగతి విద్యార్థులు 4.72 లక్షల మందికి రూ.606.18 కోట్ల ఖర్చుతో బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. వీరికి విద్యను బోధించే 50,194 మంది టీచర్లకూ రూ.64.46 కోట్లతో ట్యాబ్‌లు ఇవ్వనున్నారు.
మీ ఆరోగ్యం.. మా బాధ్యత
ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు కింద ఆధునికీకరించి.. మెరుగైన వైద్యం అందించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఎవరూ ఊహించని విధంగా పలు మార్పులు చేశారు. వైద్య ప్రక్రియలను 3.100కు పైగా వైద్య ప్రక్రియలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు.
కొత్తగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల ద్వారా కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తద్వారా గ్రామీణుల ముంగిటకు వైద్యాన్ని తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది.. విశ్రాంతి తీసుకునే సమయంలో వైద్యుల సూచన మేరకు ఆరోగ్య ఆసరా పథకం కింద సాయం చేస్తున్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల దిశగా అడుగులు
ఇన్ఫోసిస్, అసెంచర్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరెన్నో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం.
ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఒక్క గ్రీన్ ఎనర్జీలో రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సత్యవీడు, కొప్పర్తి సెజ్‌లలోని పరిశ్రమల్లో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకున్నారు.
నాటికి, నేటికి ఎంత తేడా!
టీడీపీ సర్కార్ హయాంలో ఏ సంక్షేమ పథకం కింద లబ్ధి పొందాలన్నా.. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. లంచాలు ఇచ్చినా ప్రయోజనం చేకూర్చేవారు కాదని ప్రజలు నాటి రోజులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఒక్కరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా అర్హతే ప్రమాణికంగా ఇతర పార్టీలకు ఓట్లేసిన వారికి సైతం సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్రతి ఇంటికీ వెళ్లి చేసిన మంచిని వివరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఇలా ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు వారు ఏవైనా సమస్యలు చెబితే వాటిని పరిష్కరించడానికి, అక్కడ ప్రాధాన్యత పనులను తక్షణమే చేపట్టడానికి రూ.20 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నారు.
అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కావాలి
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో భాగంగా వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే.
అభివృద్ధితో పాటు పాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడంతో రాష్ట్ర విభజనతో మనకు ఎంతగా నష్టం జరిగిందో స్పష్టమవుతోంది. లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పొరపాటు ఇకపై జరక్కుండా ఉండాలంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం అత్యంత ఆవస్యకం అనే విషయం గురించి పాలక పక్షం సభలో స్పషీ్టకరించనుంది. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవ్వడం ద్వారా కలిగే చేటు గురించి ఉదాహరణలతో వివరించాలని నిర్ణయించింది.
9 గంటలకు అసెంబ్లీ
గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో పాటు ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాల అనంతరం శాసన సభా వ్యవహరాల సలహా కమిటీ సమావేశమై, సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏయే అంశాలను చర్చకు చేపట్టాల్లో ఖరారు చేయనుంది.
అసెంబ్లీ ఉప సభాపతిగా అధికార పక్షం ఇప్పటికే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప సభాపతి ఎన్నిక ఏ తేదీన చేపట్టాల్లో కూడా శాసన సభా వ్యవహారాల సలహా కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణలపై గురువారం అసెంబ్లీలో అధికార పక్షం స్వల్ప కాలిక చర్చను చేపట్టనుంది.
AP Assembly Session: వికేంద్రీకరణే..!
Published Thu, Sep 15 2022 3:36 AM | Last Updated on Thu, Sep 15 2022 8:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment