రైతన్నకు సౌరశక్తి.. తొలి అడుగు పడింది | AP CM YS Jagan Setup Mega solar power project in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రైతన్నకు సౌరశక్తి.. తొలి అడుగు పడింది

Published Fri, Feb 5 2021 4:50 AM | Last Updated on Fri, Feb 5 2021 5:01 AM

AP CM YS Jagan Setup Mega solar power project in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్‌ అందించేందుకు తొలి అడుగు పడింది. వచ్చే 30 ఏళ్లపాటు నిరంతరాయంగా వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకాన్ని కొనసాగించే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక మెగా సోలార్‌ ప్రాజెక్టును పట్టాలపైకి తెచ్చింది. రైతన్నకు మరింత ఊతం ఇవ్వబోతున్న ఈ మెగా సోలార్‌తో... యూనిట్‌ కేవలం రూ.2.48కే అందబోతోంది. ఫలితంగా మొదటి సంవత్సరంలోనేరూ.3,836 కోట్లు ఆదా అవుతాయి. మొత్తంగా వచ్చే 30 ఏళ్లలో ఈ మెగా సోలార్‌తో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1.2 లక్షల కోట్లు ఆదా కాబోతోంది.

ఏటా 14వేల మిలియన్‌ యూనిట్లు
వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందించాలంటే ఏటా దాదాపు 14 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం సబ్సిడీగా డిస్కమ్‌లకు అందిస్తోంది. గతంలో డిస్కమ్‌లకు ఈ సబ్సిడీ చెల్లింపులు అరకొరగానే ఉండేవి. దీంతో విద్యుత్‌ సంస్థలు భారీ అప్పుల్లో కూరుకుపోయి మనలేని స్థితికి చేరాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో దాదాపు రూ.17,900 కోట్లు విద్యుత్‌ సంస్థల చేతికందేలా చర్యలు తీసుకుంది ఇక ఈ ఏడాది సబ్సిడీ దాదాపు రూ.9 వేల కోట్లకు చేరింది. ఇలా పెరుగుతున్న సబ్సిడీకి కారణం టీడీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా, భారీ ధరలకు చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలే.

మరి దీన్ని నియంత్రించటమెలా? ఎక్కడో ఒకచోట కళ్లెం వేయకపోతే భవిష్యత్తు భయంకరంగా తయారవుతుంది కదా? ఇదే ఉద్దేశంతో సబ్సిడీ భారాన్ని నియంత్రించడానికి కదిలిన ప్రభుత్వం..  వ్యవసాయానికి చౌక విద్యుత్‌ అందించడానికి 6,400 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడి కావాలి. అందుకే ‘బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ)’ పద్ధతిలో మెగా సోలార్‌కు టెండర్లు పిలిచింది. నిర్మాణ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయడానికి గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ టెండర్లు పిలవగా... ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ముందే టెండర్‌ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించింది. విద్యుత్‌ దిగ్గజాలు ఎన్‌టీపీసీ, టోరెంట్‌ పవర్, అదానీ సహా మరికొన్ని సంస్థలు పోటీపడ్డాయి. పది ప్రాంతాల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం 24 బిడ్లు వచ్చాయి. రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టడం వల్ల సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ కనిష్టంగా రూ.2.48కే లభించే వీలు కలిగింది. టెండర్లను ఖరారు చేసిన గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌... రివర్స్‌ టెండరింగ్‌తో తొలి ఏడాదే రూ.3,836 కోట్ల ప్రజాధనం ఆదా అవుతున్నట్లు తెలియజేసింది.

టీడీపీ అడ్డగోలు ఒప్పందాలు...
విద్యుత్‌ నిర్వహణలో విద్యుత్‌ కొనుగోళ్ళే కీలకం. కాకపోతే 2014–19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది. 2014లో రూ.33,500 కోట్లు ఉన్న విద్యుత్‌ రంగం అప్పులు... టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా జరిపిన ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్ళు, అవినీతి కారణంగా 2019 మార్చి చివరినాటికి రూ.70,250 కోట్లకు చేరాయి. విద్యుత్‌ సంస్థల చెల్లింపులు రూ.2,893 కోట్ల నుంచి ఏకంగా రూ.21,500 కోట్లకు చేరాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థలు రూ.19920 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రయివేటు సౌర, పవన విద్యుత్‌ కొనుగోళ్ళను తెలుగుదేశం అవసరానికి మించి ప్రోత్సహించి... సోలార్‌కు యూనిట్‌కు రూ. 5.25 నుంచి రూ.5.90 వరకూ చెల్లించేలా... అది కూడా పాతికేళ్ల పాటు అమల్లో ఉండేలా దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయా ప్రయివేటు విద్యుత్‌ సంస్థలు చెల్లించే ఆదాయపు పన్నును, ఎలక్ట్రిసిటీ డ్యూటీని తిరిగి వాళ్లకు రిఫండ్‌ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది.

ఇవి కూడా కలిపితే యూనిట్‌ విద్యుత్‌ ఖరీదు చాలా ఎక్కువ. ఫలితంగా విద్యుత్‌ సంస్థలపై మోయలేని భారం పడింది. పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ. 4.84 చొప్పున చెల్లించేలా ఏకంగా 41 విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంది. ఈ ధరకు ఆదాయపు పన్ను, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీఫండ్‌ అదనం. పైపెచ్చు పవన, సౌర విద్యుత్‌ కోసం థర్మల్‌ విద్యుత్‌ను తగ్గించి, స్థిర ఛార్జీలు వృధాగా చెల్లించింది. చిత్రమేంటంటే టీడీపీ ప్రభుత్వం నామినేషన్లపై ఇలా ఏకపక్షంగా రూ.4.84 చెల్లించి పీపీఏలు చేసుకున్న సంవత్సరంలోనే... అంటే 2017లోనే గుజరాత్‌ ప్రభుత్వం టెండర్లు పిలిచి యూనిట్‌ను రూ.2.43కే కొనుగోలు చేసింది. దీన్నిబట్టే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో తేలిగ్గా అర్థమవుతుంది. తాజాగా మెగా సోలార్‌ ప్రాజెక్టులో భాగంగా యూనిట్‌ రూ.2.48కే వస్తుండటంతో... సబ్సిడీ కష్టాలకు చెక్‌పడి, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ అందనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement